కంబదూరు పట్టణీకరణకు సమగ్ర ప్రణాళిక
అనంతపురం అర్బన్ : కంబదూరు మండలం పట్టణీకరణ పనులకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ జి.వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కంబదూరు క్టసర్ ఎన్ఆర్యూఎం (నేషనల్ రుర్బన్ మిషన్)పై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కంబదూరు క్లస్టర్ పట్టణీకరణ క్రమంలో మౌలిక వసతుల కల్పన, చేపట్టాల్సిన పనులకు సంబంధించిన పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చర్చించారు.
కంబదూరు క్లస్టర్‌ను పట్టణ తరహాలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్, జిల్లా మిషన్ లీడర్ సూచించారు. ఎన్ఆర్యూఎం కమిటీలో ప్రస్తుతం ఉన్న సభ్యులే కాకుండా సంయుక్త కలెక్టర్, డీఆర్డీఏ పీడీ, ఎల్డీఎం, డీపీఈఓ, ఐసీడీఎస్‌పీడీ, వ్యవసాయ శాఖ జేడీతో పాటు ప్రాథమిక రంగంలోని ప్రతి అధికారినీ చేర్చాలని ఆదేశించారు. సమావేశంలో కమిటీ సభ్యులు సీపీఓ సుదర్శనం, డ్వామా పీడీ నాగభూషణం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరాంనాయక్, పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బరావు, డీపీఓ జగదీశ్వరమ్మ, కంబదూరు ఎంపీడీఓ, క్లస్టర్ కో - ఆర్డినేటర్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.