మన భాగ్యనగరం... పరిశోధనల భాండాగారం
టాప్ స్టోరీ: ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే పరిశోధనలు-ఆవిష్కరణల్లో ముందుండాలి. పరిశోధనల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా ఎన్నో రీసెర్చ సెంటర్లను ఏర్పాటు చేసింది. మేటి విద్యా సంస్థలకు నిలయమైన హైదరాబాద్.. ఎన్నో పరిశోధన సంస్థలకు కేంద్రంగా విరాజిల్లుతోంది. వీటిని ఆసరాగా చేసుకుని నగర యువత పరిశోధనల్లో రాణిస్తోంది. మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను చూపుతోంది. తద్వారా అత్యుత్తమ కెరీర్‌కు బాటలు వేసుకుంటోంది. కొత్త విద్యా సంవత్సరంలో పరిశోధనలకు నోటిఫికేషన్లు విడుదలవుతున్న నేపథ్యంలో.. నగరంలో కొలువుదీరిన పరిశోధన సంస్థలు, కోర్సుల వివరాలు..
పరిశోధనాంశాలెన్నో..
హైదరాబాద్‌లో సామాజిక శాస్త్రాలు మొదలుకొని బేసిక్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్, ఎర్త్ సెన్సైస్ వరకూ.. ఆహార ధాన్యాల నుంచి ఫార్మాస్యూటికల్ సెన్సైస్ వరకూ అన్ని రకాల పరిశోధలు సాగుతున్నాయి. సామాజిక సమస్యలపై, వివిధ వ్యాధులకు కారణాలు, దేశ రక్షణకు అవసరమైన పరికరాల తయారీ, పశువుల వ్యాధులు వంటి ఎన్నో అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ టూ పీహెచ్డీ
ఆయా పరిశోధన సంస్థల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ నుంచి పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్.. అజీం ప్రేమ్‌జీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌తో కలిసి ఎడ్యుకేషన్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్ - పీహెచ్డీ, ఉమెన్స్ స్టడీస్‌లో పీహెచ్డీ కోర్సును అందిస్తోంది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో.. ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, పీహెచ్డీ, కెమిస్ట్రీలో పీహెచ్డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన సంస్థలు వివిధ అంశాల్లో పీహెచ్డీ కోర్సులను అందిస్తున్నాయి.
పరిశోధనలతోపాటు ప్రోత్సాహం..
జేఆర్‌ఎఫ్‌నకు అర్హత సాధించి పీహెచ్డీ చదివే అభ్యర్థులకు ఆయా సంస్థల నియమ నిబంధలను బట్టి మొదటి రెండేళ్లు ప్రారంభంలో నెలకు రూ.12,000 నుంచి రూ.16,000 వరకు అందిస్తున్నాయి. తర్వాత మూడేళ్లు నెలకు రూ.14,000 నుంచి రూ.20,000 వరకు చెల్లిస్తున్నాయి. ప్రతి ఏటా కాంటిన్జెన్సీ గ్రాంట్‌ను కూడా ఇస్తున్నాయి. ఈ మొత్తం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటు ంది. విద్యార్ధులు కేవలం అకడెమిక్స్కే పరిమితం కాకుండా.. పరిశోధనలు చేస్తే అద్భుత కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చని ఎన్జీఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ ఆర్.కె.చద్ధా సూచించారు.
ఐఐటీ- హైదరాబాద్ విద్యార్థుల ప్రతిభ
రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రతను పసిగట్టే మ్యాగ్నటిక్ సెన్సార్ అభివృద్ధిలో కీలకంగా మారారు ఐఐటీ-హైదరాబాద్ పీహెచ్డీ విద్యార్థులు. ఇలాంటి ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించేందుకు తమ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని ఐఐటీ హైదరాబాద్ డెరైక్టర్ యు.బి.దేశాయ్ తెలిపారు. వివిధ అంశాలపై క్యాంపస్‌లో 400 మంది పీహెచ్‌డీలు చేస్తున్నారని చెప్పారు. సిటీలోని పలు ఇంజనీరింగ్ క్యాంపస్‌లు కూడా పరిశోధనలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ప్రాజెక్టులు, వర్క్‌షాప్స్, ఫెస్ట్‌ల వంటివి విద్యార్థుల్లో అంతర్గతంగా దాగిన ఇన్నోవేషన్‌ను వెలికితీసేందుకు వారధిగా ఉపయోగపడతాయని ఐఐటీ మద్రాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఆర్.డేవిడ్ కొయిల్ పిళ్లై చెప్పారు.
కోర్సులు.. అర్హతలు..
ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశించాలంటే.. నిర్దేశిత మార్కులతో సంబంధిత/అనుబంధ సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. పీహెచ్డీ కోర్సులో ప్రవేశానికి నిర్దేశిత మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆయా పరిశోధన సంస్థల నిబంధనలకు అనుగుణంగా సీఎస్ఐఆర్-నెట్, గేట్, యూజీసీ-నెట్, ఐసీఎంఆర్ - జేఆర్ఎఫ్, డీబీటీ-జేఆర్ఎఫ్, డీఎస్టీ-ఇన్స్పైర్ వంటివాటిలో అర్హత సాధించాలి. వీటి ఆధారంగా వివిధ పరిశోధన సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇవేకాకుండా.. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ(డీబీటీ), డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్టీ), ఐసీఎంఆర్ వంటివి కూడా పరీక్ష/మౌఖిక పరీక్ష ఆధారంగా అభ్యర్థులను జేఆర్ఎఫ్కు ఎంపిక చేస్తాయి.
సిటీలో పరిశోధన సంస్థలు..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ
సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్
బయాలజీ(సీసీఎంబీ)
సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్
డయాగ్నస్టిక్స్(సీడీఎఫ్‌డీ)
నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ
సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్
నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్
డెరైక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్
డెరైక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్
డెరైక్టరేట్ ఆఫ్ సోర్గమ్ రీసెర్చ్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్(టిస్)
ఫుడ్ అండ్ డ్రగ్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్
నేషనల్ సెంటర్ ఫర్ లేబొరేటరీ సెన్సైస్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్
ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్)
సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్
అటామిక్ మినరల్స్ డెరైక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్
అండ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇండియన్ ఓషన్ స్టడీస్.
భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలు
‘‘నాణ్యమైన విద్యతోనే నిపుణులు తయారవుతారు. గతంతో పోల్చితే విద్యార్థులు ప్రస్తుతం ప్రయోగాలు, పరిశోధనల వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఎన్నో కొత్త ఆవిష్కరణలు భారతదేశం నుంచి వెలుగుచూస్తాయి. అకడమిక్స్, ప్లేస్‌మెంట్స్.. ఈ రెండే కాకుండా విద్యార్థులు రీసెర్చలోనూ పాల్గొనాలి. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను విరివిగా అందిపుచ్చుకోవాలి.
-ప్రొఫెసర్ దేవేంద్ర జలిహల్,
ఐఐటీ-మద్రాస్