ఈ ప్రపంచం రోగగ్రస్తం!
95 శాతం మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య
* మూడో వంతు మందికి ఐదు కంటే ఎక్కువ వ్యాధులు
* అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడి
వాషింగ్టన్: ప్రపంచ జనాభాలో ఏకంగా 95 శాతం మంది ప్రజలు రోగగ్రస్తులే! దాదాపు మూడొంతుల మందికి ఐదు కన్నా ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ప్రతి ఇరవై మందిలో ఒక్కరు మాత్రమే ఆరోగ్యవంతులు ఉన్నారు.1990-2013 సంవత్సరాల మధ్య కాలంలో ఆరోగ్య పరిస్థితులపై ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ(జీబీడీ)’ పేరుతో జరిగిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఈ సర్వే ఫలితాలు తాజాగా అంతర్జాతీయ మెడికల్ జర్నల్ ‘ద లాన్సెట్’లో ప్రచురితమయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. 188 దేశాల నుంచి 35,620 వనరుల నుంచి సమాచారం సేకరించి పరిశోధించారు.
సర్వేలోని ముఖ్యాంశాలు...
⇒ 2013 నాటికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 20 మందిలో ఒకరు (4.3 శాతం) మాత్రమే ఉన్నారు.
⇒ ప్రపంచ జనాభాలో మూడొంతుల మంది (230 కోట్లు) ఐదు కన్నా ఎక్కువ అనారోగ్యాలతో బాధపడుతున్నారు. పది ఆరోగ్య సమస్యలు ఉన్నవారి సంఖ్య 1990-2013 మధ్యలో ఏకంగా 52 శాతం పెరిగింది.
⇒ 1990, 2013లో నడుం నొప్పి, కుంగుబాటు, రక్తహీనత, మెడ నొప్పి, వయసు సంబంధ వినికిడిలోపం వంటి సమస్యలే ఆరోగ్య నష్టాలకు అత్యధికంగా కారణమయ్యాయి.
⇒ 2013లో ప్రపంచ ఆరోగ్య నష్టాలకు ముఖ్యంగా నడుంనొప్పి, కీళ్లనొప్పి, కుంగుబాటు, ఆందోళన, డ్రగ్స్, ఆల్కహాల్ సంబంధిత అనారోగ్యాలే అధికంగా కారణమయ్యాయి.
⇒ ప్రపంచవ్యాప్తంగా అనారోగ్య సమస్యల వల్ల ప్రజలు తమ జీవితాల్లో నష్టపోయిన ఆరోగ్యకర సంవత్సరాలు 1990లో 21 శాతం కాగా, అది 2013 నాటికి 31 శాతానికి పెరిగింది.
⇒ 1990తో పోల్చితే 2013 నాటికి మరణాల రేటు కంటే అంగ వైకల్య రేటు చాలా నెమ్మదిగా తగ్గుతోంది.