international summit
-
విశ్వనగరి విశాఖ.. 2023లో వైజాగ్‌లో జరిగే ప్రధాన ఈవెంట్స్ ఇవే!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్)గా విశాఖపట్నాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంతర్జాతీయంగా బ్రాండింగ్ కల్పించేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. వరుస అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దేశంలోనే అత్యధిక కార్యక్రమాలు జరుగుతున్న (మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ) నగరంగా విశాఖ పేరు మారుమోగేలా చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో జాతీయ, అంతర్జాతీయ సమావేశాలకు విశాఖను వేదిక చేయనుండటమే దీనికి నిదర్శనం. ప్రపంచంలోనే ఆర్థికంగా మొదటి 20 స్థానాల్లో ఉన్న దేశాల(జీ–20)కు ఈ ఏడాది భారత్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడంతో విశాఖ వేదికగా మూడు అంతర్జాతీయ సదస్సులు నిర్వహించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. వరుస సదస్సులు.. వేడుకలతో.. ఫిబ్రవరి 3, 4 తేదీలతో పాటు ఏప్రిల్ 24న విశాఖ కేంద్రంగా ఆర్థిక, వ్యవసాయ, పర్యావరణ, విద్య, వైద్యం వంటి అంశాలపై నిర్వహించే సదస్సులకు పలు దేశాల నుంచి వందలాది మంది ప్రతినిధులు విశాఖ రానున్నారు. విశాఖ బ్రాండ్ ఉట్టిపడేలా వారికి అతిథి మర్యాదలు చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్) 2023 పేరుతో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనిని విజయవంతం చేసేవిధంగా ప్రత్యేక లోగోను రూపొందించి పలు దేశాల్లో రోడ్ షోలను నిర్వహించబోతోంది. హై ఎండ్ టెక్నాలజీకి విశాఖను వేదికగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా జనవరి 20, 21 తేదీల్లో ఇన్ఫినిటీ వైజాగ్ పేరుతోను, ఫిబ్రవరి 16,17 తేదీల్లో గ్లోబల్ టెక్ సమ్మిట్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ రెండు కార్యక్రమాలకు వివిధ బహుళజాతి ఐటీ కంపెనీల ప్రతినిధులు విశాఖకు తరలిరానున్నారు. ఈ సందర్భంగా విశాఖలో ఐటీ రంగానికి ఉన్న మౌలిక వసతులు, బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు వంటి వాటిని ప్రత్యక్షంగా వారికి వివరించనున్నారు. అలాగే ప్రవాసాంధ్ర వైద్యులు రాష్ట్రంలోని వైద్య రంగంలో గల అవకాశాలపై జనవరి 6 నుంచి 8 వరకు మూడు రోజులు పాటు విశాఖ వేదికగా సదస్సులు నిర్వహించనున్నారు. వీటితోపాటు పర్యాటకం, మారిటైమ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో కూడా విశాఖ వేదికగా సదస్సులు నిర్వహించడానికి ఆయా విభాగాలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత విశాఖ ప్రగతిని మార్చే భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన జరగనుంది. ఇలా వరుస సదస్సులు, వేడుకులతో విశాఖ నగరం దేశంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా నిలుస్తోంది. స్టార్ హోటల్స్ ఫుల్ వరుసగా అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులు విశాఖలో జరగనుండటంతో ఈ కార్యక్రమాలకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు ముందస్తుగా స్టార్ హోటల్స్ గదులను బుక్ చేసుకుంటున్నారు. విశాఖలో ఫైవ్ స్టార్, ఫోర్ స్టార్ హోటల్స్ అన్నిటిలో 700కు పైగా గదులు ఉండగా.. వచ్చే ఏడాది ఈవెంట్స్ రోజులకు సంబంధించి అప్పుడే చాలా గదులను బుక్ అయినట్లు హోటల్స్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. సాధారణ రోజుల్లో స్టార్ హోటల్స్‌లో ఆక్యుపెన్సీ రేషియో 60 నుంచి 70 శాతంగా ఉంటుండగా, వచ్చే ఏడాది ఈ సమావేశాల తేదీల్లో అప్పుడే పలు హోటల్స్‌లో గదులు 100 శాతం బుక్ అయినట్లు తెలిపారు. క్యాపిటల్ రాజధానిగా ప్రకటించిన తర్వాత విశాఖ వేదికగా పలు కార్యక్రమాలు జరుగుతుండటంతో హోటల్, ట్రావెల్స్‌కు డిమాండ్ పెరిగినట్లు ఆయా రంగాల ప్రతినిధులు తెలిపారు. బీచ్ ఐటీ కాన్సెప్ట్‌ను ప్రచారం చేస్తున్నాం విశాఖకు ఐటీ కంపెనీలను ఆకర్షించే విధంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. విశాఖను అంతర్జాతీయంగా ప్రమోట్ చేసే విధంగా బీచ్ ఐటీ కాన్సెప్ట్‌పై అత్యధికంగా దృష్టి పెట్టాం. వచ్చే ఏడాది నుంచి విశాఖ రాజధానిగా ప్రభుత్వ కార్యకలపాలను ఇక్కడ నుంచే కొనసాగిస్తుంది. – గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి హై ఎండ్ ఐటీ హబ్‌గా వైజాగ్ టెక్నాలజీ రంగంలో కొత్తగా వస్తున్న ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటూ హై ఎండ్ టెక్నాలజీ కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా నాల్గవ తరం టెక్నాలజీ ఇండస్ట్రీ–4లో పెట్టుబడులను ఆకర్షించే విధంగా జనవరి 20, 21 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఇన్ఫినిటీ వైజాగ్ పేరుతో ఐటీ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నాం. – శ్రీధర్ కోసరాజు, ప్రెసిడెంట్, ఐటాప్ హోటల్ గదులకు డిమాండ్ పెరిగింది మార్చి, ఏప్రిల్‌లో జరిగే సదస్సుల నిమిత్తం ఇప్పటి నుంచే బుకింగ్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్, జీ–20 సమావేశాల తేదీల్లో స్టార్ హోటల్స్ గదులకు డిమాండ్ అధికంగా ఉంది. ఇప్పటికే కొన్ని హోటల్స్‌లో గదులు 100 శాతం బుక్ అయ్యాయి. కోవిడ్ తర్వాత ఈ స్థాయిలో గదులు నిండటం ఇదే తొలిసారి. – పవన్ కార్తీక్ ఎంవీ, వైస్ ప్రెసిడెంట్, హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ -
ఎట్టకేలకు క్వాడ్ శిఖరాగ్రం
దాదాపు పద్నాలుగేళ్ల క్రితం ఒక ప్రతిపాదనగా మొదలైన చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల భావన ఇప్పుడు శిఖరాగ్ర సమావేశం వరకూ వచ్చింది. శుక్రవారం తొలి శిఖరాగ్రం జరగబోతోంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సభ్య దేశాలుగా వున్న ఈ కూటమిపై మొదట్లో చైనా శంకలకు పోయింది. అది తనకు వ్యతిరేకంగా పురుడుపోసుకున్న కూటమి అని, దక్షిణ చైనా సముద్ర జలాల్లో తన ఆధిక్యతను తగ్గించేందుకు జపాన్, అమెరికాలు ఏకమై భారత్, ఆస్ట్రేలియాలను కూడా కలుపు కొని రూపొందించిన వ్యవస్థ అని భావించింది. కానీ తాజాగా జరగబోయే శిఖరాగ్ర సమావేశానికి ముందు బుధవారం చేసిన ప్రకటనలో చైనా కొంత వెనక్కి తగ్గిన దాఖలా కనబడుతోంది. ఈ ప్రాంతంలో శాంతిసుస్థిరతలకు దోహదపడేలా... ఇక్కడి ప్రయోజనాలను పరిరక్షించేలా, పార దర్శకంగా, అందరినీ కలుపుకొనిపోయే రీతిలో క్వాడ్ వుండాలని కోరుకుంటున్నట్టు ప్రకటించింది. మూడేళ్లక్రితం ప్రతిపాదన స్థాయి దాటి సంస్థాగత రూపం సంతరించుకోవటం మొదలైనప్పుడు చైనా ఇందుకు భిన్నంగా స్పందించింది. ‘ఇది కేవలం పతాకశీర్షికలకెక్కడానికి చేస్తున్న ప్రయత్నం. సముద్రంలో కొట్టుకొచ్చే నురుగలాంటిది. కనుమరుగు కావటానికి ఎంతో కాలం పట్టదు’ అని వ్యాఖ్యానించింది. మొత్తానికి తొలిసారి క్వాడ్ దేశాల అధినేతలు ఆన్లైన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనబోతున్నారు. దక్షిణాసియాలో, హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా అడుగులేయాలని నిర్ణయించుకున్నప్పటినుంచి మన దేశం క్వాడ్‌పై ఆసక్తి చూపటం మొదలుపెట్టింది. ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ) పేరిట యూరేసియా, హిందూ మహా సముద్ర తీర ప్రాంతాలను కలిపే బృహత్తర ప్రాజెక్టుకు చైనా రూపకల్పన చేయటం, అది మన వ్యూహాత్మక ప్రాంతాలను ఒరుసుకుంటూ వుండటంతో మన దేశం అప్రమత్తమైంది. అలాగని కేవలం చైనా వ్యతిరేకత ఒక్కటే క్వాడ్‌కు ప్రాతిపదికగా వుండటం సమ్మతం కాదని మన దేశం తెలిపింది. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ఆ సంగతిని స్పష్టంగానే చెప్పారు. మూడేళ్లక్రితం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆ మాటే అన్నారు. ఇండో–పసిఫిక్ భావన కేవలం భౌగోళిక పరమైనదే తప్ప, వ్యూహాత్మకమైనది కాదని వివరించారు. ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకోని దీన్ని రూపొందించటం లేదని తెలిపారు. అయితే చైనా వ్యవహారశైలి క్రమేపీ మారుతూ వస్తోంది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో, తూర్పు లద్దాఖ్‌లో, హాంకాంగ్, తైవాన్ తదితరచోట్ల దాని దూకుడు పరో క్షంగా క్వాడ్‌కు మళ్లీ ప్రాణం పోసింది. బైడెన్ వచ్చాక కూడా క్వాడ్‌కు అమెరికా మంచి ప్రాధాన్యత ఇస్తోంది. అమెరికా రక్షణ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నవారు తొలుత నాటో ప్రధాన కార్యాలయం కొలువుదీరిన బ్రస్సెల్స్ సంద ర్శిస్తారు. అందుకు భిన్నంగా కొత్త రక్షణమంత్రి ఆస్టిన్ లాయిడ్ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంపైనే శ్రద్ధపెట్టారు. ఆ వెంటనే శిఖరాగ్ర సదస్సు తేదీలు ఖరారయ్యాయి. ప్రపంచంపై ఆధిపత్యానికి చైనా ప్రయత్నిస్తున్నదని, దాన్ని సకాలంలో కట్టడి చేయకుంటే ముప్పు కలుగు తుందని అమెరికా నమ్ముతోంది. ఇలాంటి అభిప్రాయమే క్వాడ్‌లోని ఇతర దేశాలకు కూడా వుంది. జపాన్‌కు దక్షిణ చైనా సముద్ర జలాల్లో, ఆస్ట్రేలియాకు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఆ దేశంతో సమస్యలున్నాయి. భౌగోళికంగా చూస్తే అమెరికాకు చైనాతో సమస్యల్లేవు. కానీ మొత్తంగా తన ఆధిపత్యానికి ఆ దేశం ఎసరు పెట్టవచ్చునని అమెరికా ఆందోళనలో వుంది. ట్రంప్ ఏలుబడి పుణ్యమా అని యూరొపియన్ యూనియన్(ఈయూ) తన తోవ తాను చూసుకుంది. నాటో కూటమి కొనసాగాలంటే దానికయ్యే వ్యయం భరించాలని ట్రంప్ అప్పట్లో చెప్పటం ఈయూ దేశాలకు ఆగ్రహం కలిగించింది. ఇదే అదునుగా ఈయూతో చైనా సన్నిహితమైంది. బైడెన్ వచ్చే లోపు ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలను మొన్న జనవరిలో ముగించి, సూత్రప్రాయమైన అవగాహనను కుదుర్చుకుంది. ఇలా ఎక్కడికక్కడ తలనొప్పిగా మారిన చైనాపై అమెరికాకు ఆగ్రహం వుండటంలో ఆశ్చర్యం లేదు. కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటానికి అవసరమైన నిధులు సమీకరించటం, కీలక సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు, వాతావరణ మార్పులు వంటి అంశాలు క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో చర్చకు రాబోతున్నాయి. వీటితోపాటు ఇండో–పసిఫిక్ దేశాల భద్రతకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా సమీక్షిస్తారు. ఇక్కడే మన దేశం ఆచి తూచి అడుగేయటం ఉత్తమం. చైనాతో మనకు సమస్యలున్న మాట వాస్తవమే. మొన్న వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనికులు రెచ్చిపోయి, అకారణంగా ఘర్షణలకు దిగి మన జవాన్లను పొట్టనబెట్టుకున్నా మన దేశం సంయమనం చూపింది. ఆ దేశంతో ఎంతో ఓపిగ్గా పలు దఫాలు చర్చలు జరిపి ఆ సమస్యకొక పరిష్కారాన్ని సాధించగలిగింది. ఇతర అంశాల విషయంలో కూడా ఈ వైఖరే మన దేశానికి మేలు చేస్తుంది. అమెరికా–పూర్వపు సోవియెట్ యూనియన్ల మధ్య దశాబ్దాలపాటు సాగిన ప్రచ్ఛన్న యుద్ధం పర్యవసానాలు అందరికీ అనుభవమే. ఆ రెండు దేశాలతోపాటు వాటి వెనక సమీకృతమైన దేశా లన్నీ అప్పట్లో అభివృద్ధి ప్రాజెక్టులపై కన్నా భద్రతపై ఎక్కువ కేంద్రీకరించాల్సివచ్చింది. ఆ పరిస్థితి మరోసారి తలెత్తకూడదు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సు అందుకు అనుగుణమైన నిర్ణయాలు తీసు కోవాలని ఆశించాలి. -
అంతర్జాతీయ సదస్సుకు సిద్ధిపేట అధ్యాపకురాలు
సాక్షి, హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తోన్న నందిగామ నిర్మల కుమారి అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ), అయోధ్య రీసెర్చ్ సెంటర్ సంయుక్త సారథ్యంలో ‘రామచరిత మానస శాస్త్రీయ అధ్యయనం’ అనే అంశంపై అక్టోబర్ 13, 14 తేదీల్లో కాకినాడలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సదస్సులో నిర్మల కుమారి తన పరిశోధనా పత్రం ‘భక్తి : పుట్టుక ప్రస్తానం, ఉద్యమం’ ను సమర్పించనున్నారు. తెలుగులోనేకాక ఇంగ్లీష, హిందీ భాషల్లోనూ పలువురు పరిశోధకులు తమ పత్రాలను ఈ సదస్సులో సమర్పించనున్నారు. ఎంపిక చేసిన పరిశోధనా పత్రాలను ఒక పుస్తకంగా, సదస్సురోజే ఆవిష్కష్కరించనున్నారు. సిద్ధిపేట అధ్యాపకురాలు నిర్మల కుమారి ఇప్పటికే ఒక పుస్తకాన్ని రచించడంతోపాటు దాదాపు ఆరు అంతర్జాతీయ, 14 జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలను సమర్పించారు. ‘భక్తి : పుట్టుక ప్రస్తానం, ఉద్యమం’ పరిశోధనా పత్రాన్ని సమర్పించనున్న సందర్భంగా నిర్మల కుమారిని పలువురు అధ్యాపకులు అభినందించారు. -
విష్ణు ఫార్మసీలో ఇండో–గల్ఫ్ అంతర్జాతీయ సదస్సు
భీమవరం : భీమవరం విష్ణు ఫార్మసీ కళాశాల, అసోసియేషన్ ఆఫ్ ఫార్మసీ ప్రొఫెషనల్స్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం రెండవ ఇండో–గల్ఫ్ అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యవక్తగా హాజరైన సౌదీ అరేబియా జజాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ భక్తిభూషణ్ బారిక్ నానోటెక్నాలజీ బేసెడ్ గ్రడ్ డెవివరి సిస్టమ్స్ అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం సదస్సుకు హాజరైన వివిధ కళాశాలల విద్యార్థులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. ఈ సదస్సులో హైదరాబాద్ మహేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీధర్, ఎపీపీ ప్రెసిడెంట్ డాక్టర్ చెన్నుపాటి సురేష్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విష్ణు ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ డి.బసవరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రసాద్, అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రసాదరాజు పాల్గొన్నారు -
7 నుంచి ‘ప్రజాస్వామ్యం’పై అంతర్జాతీయ సదస్సు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలని వివిధ రంగాలకు చెందిన మేధావులు సూచించారు. అణచివేతకు గురైన వర్గాలకు అధికారంలో వాటా ఇచ్చేలా చూడాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సమాన హక్కులు దక్కేలా కృషి చేయాలని రాజ కీయ పార్టీలపై ఒత్తిడి తేవాలని ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులను కోరారు. ‘ప్రజాస్వామ్యం- సామ్యవాదం- 21వ శతాబ్దపు నూతన ధోరణులు’ అంశంపై 7వ తేదీ నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం హైదరాబాద్‌లో ప్రభుత్వ మాజీ సీఎస్ కాకి మాధవరావు, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తదితరులు వివరించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర మంత్రి ఖుర్షీద్ ప్రారంభిస్తారని.. మరో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తారని వెల్లడించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మీడియా హౌస్ సీఈవో కె.రామచంద్రమూర్తి, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.