సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలని వివిధ రంగాలకు చెందిన మేధావులు సూచించారు. అణచివేతకు గురైన వర్గాలకు అధికారంలో వాటా ఇచ్చేలా చూడాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సమాన హక్కులు దక్కేలా కృషి చేయాలని రాజ కీయ పార్టీలపై ఒత్తిడి తేవాలని ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులను కోరారు. ‘ప్రజాస్వామ్యం- సామ్యవాదం- 21వ శతాబ్దపు నూతన ధోరణులు’ అంశంపై 7వ తేదీ నుంచి హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం హైదరాబాద్‌లో ప్రభుత్వ మాజీ సీఎస్ కాకి మాధవరావు, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య తదితరులు వివరించారు.
నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర మంత్రి ఖుర్షీద్ ప్రారంభిస్తారని.. మరో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తారని వెల్లడించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మీడియా హౌస్ సీఈవో కె.రామచంద్రమూర్తి, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.