ఇస్లామిక్ స్టేట్ సంస్థపై నిషేధం
* ఐఎస్ఐఎస్తో దేశ భద్రతకు పెనుముప్పు
* యూఏపీఏ చట్టం కింద నిషేధించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఇరాక్, సిరియాలలో వరుస హత్యలు, దాడులతో దారుణ మారణకాండను కొనసాగిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ, దాని అనుబంధ సంస్థలను భారత్ నిషేధించింది. భారత్ సహా వివిధ దేశాల యువతను ఉగ్రవాదులుగా ఆ సంస్థ నియమించుకుంటోందని, ఉగ్రవాద శిక్షణ పొందిన యువత తిరిగి దేశంలోకి ప్రవేశిస్తే జాతీయ భద్రతకే పెనుముప్పు కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ఇస్లామిక్ స్టేట్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా/డైష్ ఉగ్రవాద సంస్థ, దాని అనుబంధ సంస్థలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
ఇరాక్, దాని సరిహద్దు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐఎస్ఐఎస్ ప్రపంచ జిహాద్‌కు ప్రయత్నిస్తోందని కేంద్రం తన నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేసి సొంత ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోందని, అమాయక పౌరులను, భద్రతా బలగాలను హతమారుస్తూ ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేస్తోందని తెలిపింది. కాగా, ఐఎస్ఐఎస్లో చేరేందుకు గతేడాది ముంబై నుంచి నలుగురు యువకులు ఇరాక్, సిరియాలకు వెళ్లారు. వారిలో ఒకరు గతేడాది తిరిగి రాగా, మిగతా ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది. అలాగే, బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే యువకుడు ఐఎస్ఐఎస్కు అనుకూలంగా ట్వీటర్లో ఖాతా నిర్వహించి అరెస్టు అయిన విషయం తెలిసిందే.