కాగితం.. మరింత ప్రియం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాగితం ధరను మరోసారి పెంచేందుకు కంపెనీలు సమాయత్తమవుతున్నాయి. జనవరి లేదా ఫిబ్రవరిలో కొత్త ధరలు వర్తింపజేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. దేశీయంగా కొరత తలెత్తడంతో కలప ధర అనూహ్యంగా 60 శాతం పెరిగింది. దీనికితోడు రూపాయి పతనం కూడా ఆజ్యం పోసినట్టయింది. నాణ్యమైన పేపర్‌ను తయారు చేస్తున్న కొన్ని కంపెనీలు ఇటీవలే అన్ని రకాల అన్‌కోటెడ్ హై బ్రైట్, క్రీమ్ వోవ్ పేపర్ ధరలను టన్నుకు రూ. 3 వేల దాకా పెంచాయి. కాపియర్, పోస్టర్ పేపర్, లెడ్జర్, బీసీబీ పేపర్ ధర టన్నుకు రూ.1,500-2,000 దాకా హెచ్చించినట్టు సమాచారం. జేకే పేపర్ డిసెంబరు 1 నుంచి 3% పెంచింది. రసాయనాలు, విద్యుత్, రవాణా చార్జీలు తడిసి మోపెడు అవుతున్నాయని బల్లార్పూర్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ నీరజ్ సిన్హా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది 10 లక్షల టన్నుల కలపను పేపర్ పరిశ్రమ దిగుమతి చేసుకోవచ్చని అంచనాగా చెప్పారు.
పెంపు తప్పదు...: మరోసారి పేపర్ ధర పెంచే అవకాశం ఉందని ఐటీసీ పేపర్‌బోర్డ్స్, స్పెషాలిటీ పేపర్స్ విభాగం మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఎన్.వెంకటరామన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధర పెంచక తప్పదని అన్నారు. మొత్తం కలప అవసరాల్లో 20 శాతం దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు. దేశీయ కలపతో పోలిస్తే ఇది నాణ్యమైందని, అంతేగాక ధర 10 శాతం దాకా ఎక్కువని పేర్కొన్నారు. కాగా, పేపర్ మిల్లులు ఈ ఏడాది ఏప్రిల్‌లో 10 శాతం, సెప్టెంబరులో 12 శాతం దాకా ధర పెంచాయి. ఇలా ధరలు పెరుగుతూ పోతుంటే పరిశ్రమలో మనలేమని ప్రింటింగ్, ప్యాకేజింగ్ కంపెనీల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలు, ఆఫీస్ స్టేషనరీ, నోట్‌బుక్స్ ధరలు జనవరి నుంచి ప్రియం కానున్నాయి.