అమ్మవల్లే పదవి
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆశీస్సులతోనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీ డీ) బోర్డు సభ్యుడయ్యే అదృష్టం దక్కినట్లు జే శేఖర్ రెడ్డి తెలిపా రు. తమిళనాడు నుంచి టీటీ డీ బోర్డు సభ్యులుగా జే శేఖర్‌రెడ్డి కొత్తగా నియమితులైన సందర్భంగా ‘సాక్షి’ మంగళవారం చెన్నైలో ఆయనను కలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీనివాసుని సేవలో తరించే భాగ్యం కలగడం కలియుగ వైకుంఠవాసుడు ఇచ్చిన అపూర్వమైన వరమని అన్నారు. అలాగే ఈ భాగ్యాన్ని కలిగించిన అమ్మకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ధన్యవాదాలని అన్నారు. అమ్మ, సీఎంలను స్వయంగా కలిసి ఆశీర్వాదం పొందుతున్నట్లు చెప్పారు.
టీటీడీ బోర్డు సభ్యునిగా మీ డ్రీమ్ప్రాజెక్టులు ఏమిటని సాక్షి ప్రశ్నించగా, గత 8 ఏళ్లుగా టీటీడీ స్థానిక సలహా మండలి సభ్యులుగా స్వామివారిని సేవిస్తున్నానని, ఈ అనుభవాన్ని జోడించి తమిళనాడు భక్తులకు మరిన్ని సేవలకు కృషి చేస్తానని తెలిపారు. టీనగర్ వెంకటనారాయణ్ రోడ్డులోని శ్రీవారి ఆలయం భక్త జనసందోహానికి సరిపడా లేదని, ఈకారణంతో చెన్నై ఈసీఆర్ రోడ్డులో సువిశాలమైన అత్యంత సుందరమైన శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని భావిస్తున్నామని చెప్పారు. అయితే ఇందుకు ముందుగా బోర్డు అనుమతిని, ఆ తరువాత తమిళనాడు ప్రభుత్వం ద్వారా తగిన స్థలాన్ని పొందాల్సి ఉందని చెప్పారు.
అలాగే స్థానిక సలహామండలి సభ్యులుగా కన్యాకుమారీలో టీటీడీ ఆలయ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను తమిళనాడు ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. బోర్డు సభ్యులుగా కన్యాకుమారీ ఆలయ నిర్మాణం కూడా ప్రతిష్టాత్మకంగా పూర్తిచేయడం తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తమిళనాడు నుండి కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తులకు మార్గమధ్యంలో వీధిలైట్లు, తదితర వసతి సౌకర్యాలను కల్పించేందుకు కృష్టి చేస్తానని హామీ ఇచ్చారు. బోర్డు సభ్యునిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం టీటీడీలో చర్చించి తన సంపూర్ణమైన సేవలను తమిళనాడు ప్రజలకు అంకితం చేస్తానని తెలిపారు.