జై జాడ తెలిపితే..
కాగజ్‌నగర్: మహారాష్ర్టలోని ఉమ్రెద్ కర్హండ్లా అభయారణ్యం నుంచి గత కొద్ది రోజుల క్రితం ‘జై' అనే అతి పెద్ద పులి అదృశ్యమైంది. అది అదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఫారెస్ట్‌లోకి వచ్చినట్లు భావిస్తున్న అక్కడి సర్కారు.. దాని ఆచూకి తెలిపితే రూ. 50 వేల రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తొమ్మిది అడుగుల భారీ కాయంతో ఉండే ‘జై’ కోసం ఇప్పటికే మహారాష్ట్ర అటవీ శాఖ విస్తృత స్థాయిలో గాలించిన లాభం లేకపోవడంతో.. కొత్త దారి అన్వేషించింది. దాని వివరాలు తెలిపిన వారికి రివార్డు ఇస్తామని ప్రకటించింది. గిరిజనులు సంచరించే ప్రాంతాల్లో రివార్డుకు సంబంధించిన వివరాలను తెలియజేయడంతో జై ఆచూకీ తెలిసే అవకాశం ఉందని మహారాష్ట్ర సర్కార్ భావిస్తోంది.
ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో పులుల వలసలు సాగుతుంటాయని గుర్తించిన అధికారులు జై కూడా కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలోకి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. పులి ఆచూకి తెలిపిన వారికి నగదు పురస్కారంతో పాటు ఘన సన్మానం ఏర్పాటు చేస్తామని తెలపడంతో అటవీ ప్రాంతంలో కొత్తవేట మొదలైంది. జై లాంటి అతి పెద్ద పులిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండటంతో అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వారికి తెలంగాణ అటవీ శాఖ అధికారులు కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు.