ఊరూవాడా క్రిస్మస్ సందడి
= క్రిస్మస్ ట్రీ, పశువుల పాక ల ఏర్పాటు
= క్రిస్మస్ తాత ఆశీర్వచనాల కోసం ఎదురు చూపులు
అందాల తార... అరుదెంచె నాకై.... అంబరవీధిలో.. అని పాడుకుంటూ క్రీస్తు విశ్వాసులు క్రిస్మస్ వేడుకలకు సిద్ధమయ్యారు. మానవాళి క్షేమం కోసం శిలువపై తన రక్తాన్ని చిందించిన కరుణామయుని కరుణ కోసం ధ్యానిస్తున్నారు.
మచిలీపట్నం/ఈడేపల్లి/చల్లపల్లి రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో క్రిస్మస్ సందడి మొదలైంది. క్రీస్తు విశ్వా సులు ప్రధాన కూడళ్లలో భారీ నక్షత్రాలను ఏర్పాటుచేసి, వాటికి విద్యుత్ వెలుగులు అద్దుతున్నారు. చర్చి ప్రాంగణాల్లో ఏసు పుట్టుకును తెలిపే పశువుల పాక నమూనాలు ఏర్పాటు చేస్తున్నారు. చర్చిలను ఇప్పటికే విద్యుత్ దీపాలతో అలంకరించారు. గ్రీటింగ్ కార్డులు, క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు విక్రయించే దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పలు పాఠశాలల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
క్రిస్తు పుట్టుకే క్రిస్మస్ పండుగ
ఏసుక్రీస్తు జననం ప్రపంచగమనాన్నే మార్చింది. క్రీస్తు పుట్టుకను ఆధారంగాచేసుకుని కాలాన్ని క్రీస్తుపూర్వం, క్రీస్తుశకంగా పరిగణిస్తున్నారు. భగవంతుడు తనను తాను తగ్గిం చుకుని ఇజ్రాయేలు దేశం, బెత్లెహేంలోని పశువుల పాకలో సామాన్య మానవుడిలా రెండువేల ఏళ్లకు పూర్వం జన్మిం చిన రోజునే క్రిస్మస్‌గా జరుపుతున్నారు. 33 ఏళ్లు జీవించి మానవుల పాప విమోచన కోసం తన ప్రాణాలనే శిలువపై అర్పించి, పునరుత్థానుడైన ఏసును లోక రక్షకుడిగా కొలుస్తున్నారు. తన భోధనల ద్వారా ప్రేమతత్వాన్ని, సోదరభావాన్ని అలవరచి, ప్రజలు ఆధ్యాత్మికపథం వైపు పయనించేలా క్రీస్తు కృషిచేశారు. క్రిస్మస్ సందర్భంగా వివిధ చర్చిల్లో ఆచరించే విధానం వేర్వేరుగా ఉంటుంది.
క్రీస్తు జననాన్ని గుర్తుకు తెస్తూ చిన్నారులు ప్రదర్శించే నాటికలు, క్రిస్మస్తాత ఇచ్చే బహుమతులు, చర్చిల్లో క్రీస్తు జన్మించిన పశువుల పాక, అందులో బాలఏసు, ముగ్గురు జ్ఞానుల రాక, క్రీస్తు జననాన్ని ముందునుంచి చెబుతూ వస్తున్న గాబ్రియేలు దేవదూత, క్రీస్తు జననాన్ని చాటుతూ ఆకాశంలో ప్రత్యక్షమైన వేగుచుక్క(స్టార్), గొర్రెల కాపరుల హడావుడిని చాటుతూ చర్చిల్లో పశువుల పాకలను ఏర్పాటు చేశారు. క్రిస్మస్ ఈవ్ సందర్భగా ఏటా డిసెంబర్ 24 తేదీ రాత్రి 10 గంటల నుంచి చర్చిలో ప్రార్థనలు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం వరకు కొనసాగుతాయి. 24న రాత్రి 12 గంటలకు భక్తులు క్రీస్తు జననాన్ని చాటుతూ కొవ్వొత్తులు చేతబట్టి పాటలు పాడుతూ అన్ని వీధుల్లో తిరగడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రభువు రాక కోసం సమాయత్తం
క్రీస్తును నమ్మినవారికి ఇదోక శుభదినం. ప్రభువు రాక కోసం క్రిస్మస్కు నెల మందు నుంచే క్రీస్తు విశ్వాసులు సమాయత్తం అవుతారు. రక్షకుడిగా, మానవాళి పాపవిమోచకుడిగా, మరణాన్ని గెలిచిన మహారాజుగా ఈ లోకంలో జన్మించిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకునేందుకు ముందు నుంచే ప్రార్థనలు చేస్తున్నాం. ఈ క్రిస్మస్ అన్ని వర్గాల వారికి శాంతి, సమాధానం, ప్రేమ పంచాలి.
- రెవరెండ్ ఫాదర్ బుర్రి జాన్‌పీటర్
ఆర్సీఎం చర్చి, చల్లపల్లిమండలం, లక్ష్మీపురం