Jayam Raja
-
డబ్బు కోసం సినిమాలు చేయడం లేదు
ప్రస్తుతం నేను డబ్బు కోసం చిత్రాలు చేయడం లేదని విజయమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ వ్యాఖ్యానించారు. ఎడిటర్‌గా జీవితాన్ని ప్రారంభించి, నిర్మాతగా సుదీర్ఘ ప్రయాణంలో అనూహ్య విజయాలతో నవతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న నిత్య కృషీవలుడీయన. చిరునవ్వు ఈయనకు ఆభరణం అయితే నిరంతర శ్రమే ఈయన విజయ రహస్యం. 73 ఏళ్ల ఈ సినీ మేధావి సినిమా వయసు 60 ఏళ్లు కావడం విశేషం. ఎడిటర్ మోహన్‌కు సినిమా రెండు కళ్లు. తన పెద్ద కొడుకు జయం రాజా దర్శకుడిగా ఒక భుజం కాగా, రెండవ కొడుకు జయం రవి నటుడిగా మరో భుజంలాగా మెలుగుతున్నారు. దీంతో సినిమాకే అంకితమైన కుటుంబంగా పేరొందారు. కొడుకులకు జయం చిత్రంతో చిత్రరంగానికి శ్రీకారం చుట్టి వారి విజయానికి నాంది పలికారు ఎడిటర్ మోహన్. ఈయన్ని తమిళ చిత్ర పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ రెండూ అక్కున చేర్చుకున్నాయి. ఎడిటర్ మోహన్ ఒక కొడుకు హీరోగా, మరో కొడుకు దర్శకుడిగా జయం చిత్రం నుంచి తిల్లాలంగడి వరకు పలు హిట్ చిత్రాలను నిర్మించారు. జయం రవి ప్రస్తుతం నటించిన భూలోకం చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఇందులో జయం రవి బాక్సర్‌గా నటించారు. ఆయన సరసన త్రిష నటించారు. ఇప్పటి వరకు వెండితెరపై రానటువంటి కథాంశంతో తెరకెక్కిన చిత్రం భూలోకం అంటున్నారు ఎడిటర్ మోహన్. చిన్న గ్యాప్ తరువాత జయంరాజా జయంరవిల కాంబినేషన్లో తనీ ఒరువన్ చిత్రం తెరకెక్కుతోందని తెలిపారు. ఇందులో నయనతార తొలిసారిగా జయం రవికి జంటగా నటిస్తున్నారని ముఖ్యపాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారని తెలిపారు. అలాగే రోమియో జూలియట్ చిత్రం నిర్మాణంలో ఉందన్నారు. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్గా నటిస్తున్నారని తెలిపారు. వీటితో పాటు సూరజ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో జయంరవికి జంటగా త్రిష, అంజలి నటిస్తున్నారని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమతో తనకు చాలా అనుబంధం ఉందన్నారు. ఈ క్రమంలో 2015 ప్రథమార్థంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నానని తెలిపారు. ఇందులో ఐదుగురు హీరోలు నటించనున్నారని, కథ కూడా పక్కాగా సిద్ధం అయ్యిందని చెప్పారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడించనున్నట్లు ఎడిటర్ మోహన్ తెలిపారు. అయితే కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమై తప్పు చేశాననే బాధ ఉన్నా పిల్లల విజయానికి కృషి చేశాననే సంతృప్తి ఉందంటున్నారు ఎడిటర్ మోహన్. -
ప్రేమించాలంటూ వెంటబడ్డారు!
తనను ప్రేమించాలంటూ ఎంతో మంది వెంటబడ్డారని నటి మాళవిక వేల్స్ తెలిపారు. కేరళ త్రిచూర్ నుంచి కోలీవుడ్‌కు కొత్తగా వచ్చిన ఈమె ఇంకా చాలా చెప్పారు. ‘‘నాకు భరతనాట్యం, కూచిపూడి, మోహినీయాట్టం తెలుసు. 2009లో మిస్ కేరళ పోటీలో ‘బ్యూటిఫుల్ ఐస్’ అవార్డు అందుకున్నాను. ఆ కార్యక్రమంలో నన్ను చూసిన వినీత్ శ్రీనివాసన్ ‘మలర్వాడి ఆర్ట్స్ క్లబ్’ అనే చిత్రంలో నన్ను పరిచయం చేశారు. ఆ తర్వాత కన్నడ చిత్ర అవకాశం వచ్చింది. ఆ తర్వాత తమిళంలో ‘అళగు మగన్’ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నాను. తర్వాత ‘ఎన్న సత్తం ఇంద నేరం’ చిత్రంలో అవకాశం లభించింది. ఒకే ప్రసవంలో జన్మించిన అక్షితి, ఆప్తి, ఆకృతి, అతిథి అనే నలుగురు చిన్నారులతో నటించే అవకాశం లభించింది. చిత్రం ఈ నలుగురిపైనే కేంద్రీకృతమైంది. దర్శకుడు జయం రాజా, కాదల్‌మన్నన్ మా ను, నితిన్ సత్యాతో కలిసి నటించాను’’ అన్నారు మాళవిక వేల్స్. ఎంతో మంది మాళవికలు ఉన్నారుగా? తెలుసు. వాళమీను మాళవిక, అణ్ణి మాళవిక, మాళవికా నాయర్, మాళవికా మేనన్ అంటూ కొందరున్నారు. నాకిది తల్లిదండ్రులు పెట్టిన పేరు. అందుచేత దీనిని మార్చేది లేదు. ఒక్కొక్కరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నాకు మాళవిక వేల్స్ అని ఉందిగా! గ్లామర్‌గా నటిస్తారా? కచ్చితంగా లేదు. త్రిచూర్‌లో భావన ఇంటి పక్కనే వుంది మా ఇల్లు. ఆమె నేను ఫ్రెండ్స్. ఇంతవరకు ఆమె గ్లామర్‌గా నటించలేదు. నాకు అదే ఉద్దేశం ఉంది. ఫ్యామిలీ ఇమేజ్ మాత్రమే కావాలి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే విధంగా నటించాలని ఆశపడుతున్నాను. డ్రీమ్ రోల్? పది చిత్రాల్లో నటించాను. ఈలోపున డ్రీమ్ రోల్ గురించి ఎలా చెప్పగలను. అలా దేనికీ ఫిక్స్ అవకూడదు. ఏ రోల్లో ప్రతిభను నిరూపించుకోగలమనే విశ్వాసం ఉందో, అందులో వంద శాతం నటన ప్రదర్శిస్తా. డ్యాన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తాను. కేరళలో జరిగే ఉత్సవాల్లో నా భరతనాట్య ప్రదర్శనకు స్థానం ఉంటుంది. లవ్ చేశారా? ప్లస్ టూలో కొందరు వెంటబడ్డారు. వారిని అమ్మా, నాన్నల వద్దకు తీసుకువెళ్లి నిలబెట్టాను. తల్లిదండ్రులు వారికి ‘ఈ వయసులో ప్రేమేంటి? బుద్ధిగా చదువుకుని ముందుకు సాగండి!’ అంటూ సూచించారు. ఆ తర్వాత వారు నన్ను డిస్టర్బ్ చేయలేదు. మలయాళం, తమిళ్, తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. -
నిర్మాత దర్శకుడినెప్పుడూ మెచ్చుకోడు
చిత్ర నిర్మాత ఎప్పుడూ మెచ్చుకోరని యువ దర్శకుడు జయం రాజా వ్యాఖ్యానించారు. టాలీవుడ్ యువ నటుడు నిఖిల్‌ను కోలీవుడ్‌కు పరిచయం చేస్తున్న చిత్రం కార్తికేయన్. కలర్ స్వాతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఎం.చందు దర్శకత్వం వహించగా శేఖర్ చంద్ర సంగీత బాణీలందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు జయం రాజా మాట్లాడుతూ నిర్మాత తండ్రి అయినా ఆ చిత్ర దర్శకుడిని మెచ్చుకునే ప్రశ్నే ఉండదన్నారు. చిత్ర బడ్జెట్ పెంచావ్, నిర్మాణంలో జాప్యం అయ్యింది వంటి విమర్శలు దర్శకుడు భరించాల్సిందేనని చెప్పారు. అలాంటిది ఈ కార్తికేయన్ చిత్ర నిర్మాత, దర్శకుడిని అభినందించడం నిజంగా సంతోషంగా ఉందన్నారు. చిత్ర హీరో నిఖిల్ తెలుగులో పది చిత్రాలకు పైగా చేసి మంచి పేరు తెచ్చుకున్నారని, హీరోయిన్ స్వాతి తమిళ పరిశ్రమకు సుపరిచితురాలని పేర్కొన్నారు. తన తొలి చిత్రం జయంలో కార్తికేయన్ వేలాయుధం ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఇప్పుడీ చిత్రమే కార్తికేయన్ పేరుతో రూపొందుతోందని మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు జయంరాజా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ మోహన్, నటి తులసి, స్వాతి, నిఖిల్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. -
డైనమిక్ పాత్రలో నయన
మంచి డైనమిక్ పాత్రలో నటించాలని కథానాయకులు కోరుకోవడం సర్వసాధారణం. మరి అలాంటి పాత్రలు హీరోయిన్లను వరిస్తే ఆ పాత్రలతోపాటు ఈ నటీమణులకు క్రేజ్ లభిస్తుంది. నటి అనుష్క అరుంధతి చిత్రంలో అలాంటి పెరోషియస్ పాత్రతోనే అత్యంత ప్రాచుర్యం పొందారన్నది తెలిసిందే. తాజాగా క్రేజీ నటి నయనతార ఒక డైనమిక్ పాత్రను పోషించడానికి సిద్ధం అవుతున్నారు. జయం రాజా దర్శకత్వంలో ఆయన తమ్ముడు జయం రవి హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార నటిస్తున్నారు. ఆమె ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటించనున్నారట. ఇప్పటి వరకు తెరపై అందాలను మాత్రమే ఆరబోసిన ఈ బ్యూటీ తెలుగు చిత్రం శ్రీరామరాజ్యంలో పవిత్రమూర్తి సీతగా జీవించారు. తాజాగా పవర్ఫుల్ పాత్రలో పోలీస్ అధికారిగా నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో నయనతార ఫైట్స్ కూడా చేయనున్నారట. దీని గురించి దర్శకుడు జయం రాజా మాట్లాడుతూ తన చిత్రాల్లో హీరోతోపాటు హీరోయిన్లకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంలో నయనతారకు సూటబుల్ అయ్యే పాత్రను కొత్తగా డిజైన్ చేశామన్నారు. యాక్షన్‌తో కూడిన ఈ పాత్రకు ఆమె న్యాయం చేయగలరని పేర్కొన్నారు. ప్రస్తుతం నయన ఈ పాత్ర కోసం ఫైట్స్‌లో శిక్షణ పొందుతున్నారట.