రైతుల ప్రయోజనాలే లక్ష్యం
- వేరుశనగకు రక్షక తడులు అందించాలి
- అధికారులకు జేసీ–2 సయ్యద్ ఖాజామొహిద్దీన్ ఆదేశం
అనంతపురం అర్బన్: రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రాథమికరంగ మిషన్ పరిధిలోని నిర్ధేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై సమీక్షించారు. జేసీ–2 మాట్లాడుతూ లక్ష్యాలను పూర్తిచేసి పథకాల లబ్ధిని అర్హులైన రైతులకు సకాలంలో అందించి రెండంకెల వృద్ధి చేరుకోవాలన్నారు. బెట్ట దశలో ఉన్న వేరుశనగ పంటకు రక్షకతడులు అందించాలన్నారు. ఇందుకు అవసరమైన నీటి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు.
అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఈ–క్రాప్ బుకింగ్ ప్రక్రియని రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇన్పుట్ సబ్సిడీ అందలేదంటూ రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వారంలోగా పరిష్కరించాలని వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామ్మూర్తిని ఆదేశించారు. సమావేశంలో పట్టు పరిశ్రమ శాఖ జేడీ అరుణకుమారి, ఉద్యాన శాఖ డీడీ సుబ్బరాయుడు, మత్స్యశాఖ డీడీ హీరానాయర్, తదితరులు పాల్గొన్నారు.