ముగిసిన విద్యుత్ ఉద్యోగుల క్రీడలు
కబడ్డీ విజేత నల్లగొండ జట్టు
ద్వితీయ స్థానంలో వరంగల్
వరంగల్ స్పోర్ట్స్ :
హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల ఇంటర్ సర్కిల్ కబడ్డీ, క్యారమ్ టోర్నమెంట్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కౌన్సిల్ ఆపరేషన్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఆదివారం ముగిశా యి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ వి.వెంకటేశ్వర్రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతాయని చెప్పారు. విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు మానసిక ప్రశాంతత కల్పించేందుకే క్రీడలు నిర్వహించామన్నారు. వరంగల్ వేదికగా పది జిల్లాల విద్యుత్ ఉద్యోగులు ఒకే చోట క్రీడలకు హాజరుకావడం సంతోషంగా ఉందని తెలిపారు.
300 మంది క్రీడాకారులు హాజరు
హన్మకొండ జేఎన్ఎస్లో జరిగిన పోటీలకు తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సుమారు మూడు వందల మంది హాజరయ్యారు. కబడ్డీ పోటీల్లో నల్లగొండ జట్టు ప్రథమ బహుమతి సాధించగా.. వరంగల్ జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. ఖమ్మం జట్టు తృతీయ బహుమతి పొందింది. క్యారమ్స్‌లో విద్యుత్ సౌధ (హైదరాబాద్) ప్రథమ బహుమతి సాధించగా, ద్వితీయ స్థానంలో కరీంనగర్, తృతీయ స్థానంలో వరంగల్ క్రీడాకారులు బహుమతులను అందుకున్నారు. అనంతరం విజేతలకు ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ వి.వెంకటేశ్వర్రావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ ఎస్ఈ శివరాం, డీఈ శ్రీకాంత్, ఏడీఈ కుమారస్వామి, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ కేవీ.జాన్సన్, స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, పబ్లిసిటీ ఇన్చార్జి రౌతు రమేష్, గులాం రబ్బానీ, రాజిరెడ్డి, కుమారస్వామితో పాటు వివిధ జిల్లాల డీఈలు, ఏఈలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.