ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిద్దాం!
పీడీపీ, బీజేపీలకు గవర్నర్ ఆహ్వానం
జనవరి 1న వారితో వేర్వేరుగా భేటీ
జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. అదిపెద్ద పార్టీగా నిలిచిన పీడీపీకి మద్దతిస్తామంటూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), కాంగ్రెస్‌లు ముందుకొచ్చినప్పటికీ.. పీడీపీ వైపు నుంచి స్పందన లేదు. కానీ మద్దతిస్తామంటూ ఎన్సీ తమకు లేఖ రాసిందంటూ ఒక ఉత్తరాన్ని పీడీపీ లీక్ చేసింది.
అయితే, ప్రభుత్వ ఏర్పాటులో మద్దతిస్తామని మౌఖికంగా మాత్రమే చెప్పామని ఎన్సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. లేని లేఖను సృష్టించడం ద్వారా పీడీపీ బీజేపీతో మైండ్‌గేమ్ ఆడుతుందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పీడీపీకి బేషరతుగా మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని శుక్రవారం ఎన్సీ నేత జునియాద్ మట్టూ మరోసారి స్పష్టం చేశారు. పీడీపీ- ఎన్సీ ప్రభుత్వానికి మద్దతిస్తామని ముగ్గురు స్వతంత్రులు కూడా ముందుకొచ్చారని సమాచారం.
ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చిద్దాం రండంటూ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పీడీపీ, బీజేపీలను రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా వేర్వేరుగా ఆహ్వానించారు. జనవరి 1వ తేదీ ఉదయం పీడీపీకి, అదేరోజు మధ్యాహ్నం బీజేపీకి ఆయన సమయమిచ్చారు. జనవరి 18న ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుందని, ఆలోపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొంటూ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జుగల్ కిషోర్‌లకు గవర్నర్ లేఖలు పంపించారని రాజ్ భవన్ అధికారి ఒకరు తెలిపారు.
ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్రులు సహా తమకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో ఆ చర్చలకు రావాలని గవర్నర్ కోరినట్లు అనధికారిక సమాచారం. మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను బీజేపీ కొనసాగిస్తోంది. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవ్వాలన్న ఉద్దేశంతో రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ శ్రీనగర్‌లో చెప్పారు. కాగా, పీడీపీ చీఫ్ ముఫ్తీ మొహమ్మద్ సయీద్ శనివారం ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యే అవకాశముందని సమాచారం.
ఒత్తిళ్లకు పీడీపీ లొంగరాదు: ఆజాద్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటులో ఒత్తిళ్లకు తలొగ్గకుండా పీడీపీ నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ సూచించారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీతోపాటు తాము కూడా పీడీపీకి మద్దతు ప్రకటించామన్నారు. కాగా, మతమార్పిళ్లపై ప్రధాని మోదీ దృతరాష్ట్రు డిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.