సమాజంలో పోలీసులకు ప్రత్యేక స్థానం
సంగారెడ్డి క్రైం: ‘సమాజంలో పోలీసులకు ప్రత్యేక స్థానం ఉంది, పోలీసు ఉద్యోగంలో ప్రజలకు న్యాయం చేయడం వల్ల సంతృప్తి కల్గుతుంది’ అని రాష్ట్ర డీఐజీ (అడ్మిన్) కల్పనా నాయక్ అన్నారు. సంగారెడ్డి మండలం చిద్రుప్పలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో శుక్రవారం ఎస్‌సిటిపిసి (స్టైఫండ్ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుల్)ల 2014 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన డీఐజీ కల్పనా నాయక్‌ను జిల్లా ఎస్పీ డా.ిశెమూిషీ బాజ్‌పాయ్ సాదరంగా ఆహ్వానించారు.
9 నెలల పాటు పోలీసు శిక్షణ పూర్తి చేసుకొని ప్రజాసేవ కోసం వెళ్తున్న 58 మంది ఎస్‌సిటిపిసి (ఏఆర్)లతో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి ఉద్యోగ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా డీఐజీ కల్పనా నాయక్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగంలో కుటుంబ రక్షణతో పాటు ప్రజల రక్షణ చేయాల్సి ఉంటుందన్నారు. 87 మంది ఎస్సిటిపిసిలలో ఇన్డోర్, అవుట్డోర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయిన 58 మందిని అభినందించారు. ట్రైనింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. అత్యుత్తమంగా పోలీసు శిక్షణ ఇచ్చిన జిల్లా ఎస్పీ డా.శెమూషీ బాజ్‌పాయ్, ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, డీటీసీ సిబ్బందిని ఆమె అభినందించారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు ప్రత్యేకమైన గుర్తింపును మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి (డీజీపీ) అనురాగ్‌శర్మ, ట్రైనింగ్ ఐజీపీ రాజీవ్త్రన్లకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ (ఆపరేషన్స్) జ్యోతిప్రకాష్, జిల్లా శిక్షణ కేంద్రం డీఎస్పీ వెంకట్‌రెడ్డి, జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కె.ఎన్.విజయ్‌కుమార్, మెదక్ డీఎస్పీ రాజరత్నం, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్, సంగారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్న, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు.