తల్లిదండ్రుల ఆత్మహత్య
కల్వచర్లలో విషాదం
సెంటినరీకాలనీ: కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురే తమను కాదనుకుందని తల్లడిల్లిపోయారా తల్లిదండ్రులు. పెద్ద చదువులు చదివి తమ పెద్దరికాన్ని నిలబెడుతుందనుకుంటే.. కలలు కల్లలు చేసిందనుకుని విలవిల్లాడారు. అల్లారుముద్దుగా చూసుకున్న బంగారు తల్లి మాటైనా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం వారికి మింగుడుపడలేదు. కలత చెందిన వారు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు జీవితకాలం గుర్తుండే శిక్ష విధించారు.
కూతరుపై ఎన్నో ఆశలు పెంచుకన్న తల్లిదండ్రులు ఆమె ప్రేమ వివాహం చేసుకోవడంతో తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. కమాన్‌పూర్ మండలం కల్వచర్లలో జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసింది. కమాన్‌పూర్ ఎస్సై ఆది మధుసూదన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఒర్రె పర్వతాలు(56) ఆర్జీ–3 డివిజన్ పదో గనిలో సపోర్టుమెన్‌గా పనిచేస్తుండగా ఆయన భార్య ఒర్రె లక్ష్మి (ఐలక్క) (50) స్థానికంగా కిరాణం షాపు నిర్వహిస్తోంది. వారి కుమారుడు శ్రావణ్‌కుమార్ హైదరాబాద్‌లో ప్రెవేట్ ఉద్యోగం చేస్తుండగా కూతురు శ్వేత (19) హైదరాబాద్‌లోనే అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతోంది. గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించిన శ్వేత రెండ్రోజుల క్రితం అతడిని వివాహం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు తీవ్రమనస్థాపానికి గురై బుధవారం రాత్రి తమ ఇంట్లో క్రిమిసంహారక మందు తాగారు. లక్ష్మి అక్కడికక్కడే మృతిచెందింది. పర్వతాలును స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. అందరితో కలివిడిగా ఉండే వారి హఠాన్మరణంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. వారి కుమారుడు శ్రావణ్ ఫిర్యాదు మేరకు ఎస్సై మధుసూదన్‌రావ్ కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి వచ్చి సానుభూతి వ్యక్తంచేశారు.