మీరు పుట్టిన జిల్లా పేరు ఇవ్వండి: సీఎస్ మహంతి
కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు సీఎస్ మహంతి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారులు తాము పుట్టిన జిల్లా పేరుతోపాటు, తల్లిదండ్రులు పుట్టిన జిల్లా సమాచారాన్ని కూడా నాలుగురోజుల్లో విధిగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 23వ తేదీలోగా ఉత్తర్వుల్లో జారీ చేసిన నమూనా పత్రం ఆధారంగా వివరాలు అందించాలని ఆయన శనివారం ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్ర రెవెన్యూ సర్వీసు, రెవెన్యూయేతర సర్వీసుల నుంచి ఐఏఎస్‌లుగా ఎంపికైన వారు ఏ సంవత్సరంలో ఐఏఎస్ కోటాలో ఎంపికయ్యారు.? పుట్టిన జిల్లా, తల్లిదండ్రులు పుట్టిన జిల్లా, పాఠశాల విద్యలో నాల్గో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఎక్కడ చదివారు..? పదవ తరగతి/తత్సమాన పరీక్ష ఏ జిల్లాల్లో ఉత్తీర్ణులయ్యారు..? ఎస్సీ/ఎస్టీ/బీసీ/అన్ రిజర్వ్డ్ కేటగిరీనా.? అన్న వివరాలను కూడా సచివాలయంలోని సాధారణ పరిపాలన విభాగం అదనపు కార్యదర్శికి అందించాలని మహంతి ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జూన్ 2వ తేదీ నుంచి ఏర్పాటు కానున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కన్ఫర్డ్ ఐఏఎస్‌లను కేటాయించడానికి వీలుగా ఈ వివరాలు కోరారు.