రుణం..రణం
చిత్తూరు, నిమ్మనపల్లె : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ రుణాల మంజూరులో చోటు చేసుకుంటున్న జాప్యంపై పలువురు లబ్ధిదారులు రగిలిపోయా రు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయానికి తాళం వేసి దిగ్బంధం చేశారు. తమకు తక్షణం రుణాలు మంజూరు చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకున్నారు. అధికా రుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ముగ్గు రు ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైస్ ఎంపీపీ ఈతగట్టు చంద్రశేఖర్, వడ్డెర సంఘం నిమ్మనపల్లె అధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో పలువురు బాధితులు మధ్యాహ్నం 12గంటల నుంచి 2గంటల వరకు ఆందోళన చేపట్టారు. మదనపల్లె డివిజన్ వడ్డెర సంఘం అధ్యక్షుడు పద్మనాభరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. స్థానిక ఎంపీడీఓ, బ్యాంకు అధికారులు సకాలంలో రుణాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.
ముగ్గురి ఆత్యహత్యాయత్నం
అధికారుల తీరుకు నిరసనగా స్థానిక వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, కొండయ్యగారిపల్లెకు చెందిన నారాయణ, అగ్రహారం బండమీదమాలపల్లెకు చెందిన వెంకటరమణ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక ఎస్ఐ హరిహరప్రసాద్, బ్యాంకు మేనేజర్ వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. శనివారం ఎంపీడీఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులతో సమీక్షించి అర్హులందరికీ రుణాలు మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పడంతో ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి పలువురు వివిధ రాజకీయపార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు మద్దతు పలికారు.