బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోం: అచ్చెన్నాయుడు
కాపు కార్పొరేషన్ రుణాలు వాస్తవ రూపంలో గ్రౌండ్ కాలేదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. రూ. వెయ్యి కోట్లలో కేవలం రూ. 340 కోట్ల రుణాలు మాత్రమే మంజూరు చేశామని, ఇకపై ఇంకా ఎక్కువ రుణాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. కాపు రిజర్వేషన్ల పేరుతో బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లకు అన్యాయం జరిగితే తానే చంద్రబాబు మీద ధ్వజమెత్తుతానన్నారు.
బీసీలంతా కాస్త సంయమనం పాటించాలని, కాపు నాయకులు ఎవరైనా తనతో చర్చకు వస్తే చర్చిస్తానని అన్నారు. టీడీపీ ఎప్పుడూ కాపులకు అన్యాయం చేయలేదని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమకు వైఎస్ జగన్ మద్దతు అవసరం లేదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేస్తారన్న భయం తమకు లేదని కూడా ఆయన అన్నారు.