బల్లి పడ్డ భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత
చిత్తూరు (అర్బన్) : బల్లిపడ్డ ఆహారం తినడంతో 15 మందివిద్యార్థులు గురువారంఅస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన చిత్తూరు నగరంలోని కస్తూర్భా నగర పాలక బాలికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. నగరంలోని ఖాజీ కార్పొరేషన్ పాఠశాల నుంచి మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి ఇక్కడి విద్యార్థులకు వడ్డిస్తారు. ఈ నేపథ్యంలోనే గురువారం మధ్యాహ్నం కూడా విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఆ భోజనర తిన్న కొంతసేపటికి ఐదుగురు విద్యార్థులకు వాంతులయ్యాయి.
తరువాత మరికొంత మంది వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తర్వాత భోజనంలో బల్లిపడ్డట్టు గుర్తించారు. భోజనం పెట్టే సమయంలో ప్రధానోపాధ్యాయురాలు పాఠశాలలో లేరు. ఉపాధ్యాయులు ఆమెకు సమాచారం ఇచ్చారు. ఆమె ఇంటి నుంచి పాఠశాలకు వచ్చేంతవరకు పిల్లలకు ప్రథమ చికిత్స కూడా అందించకుండా పాఠశాలలోనే ఉంచేశారు. తరువాత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. విద్యార్థులు కోలుకున్న తరువాత పాఠశాలకు తీసుకొచ్చారు.