దక్షిణాది రాష్ట్రాలు సహకరించుకోవాలి
అటవీ శాఖ మంత్రుల సమావేశంలో జోగు రామన్న
దక్షిణాది రాష్ట్రాల మంత్రుల కౌన్సిల్ ఏర్పాటుకు తీర్మానం
హైదరాబాద్: అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద దోపిడీని అరికట్టడంలో దక్షిణాది రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అధ్యక్షతన తిరువనంతపురంలో గురువారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల అటవీ శాఖ మంత్రుల సమావేశంలో రామన్న పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో స్మగ్లర్ల నుంచి దక్షిణాది రాష్ట్రాలు సవాలు ఎదుర్కొంటున్నాయన్నారు.
పచ్చదనాన్ని పెంచేందుకు హరితహారం
తెలంగాణలో అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచేందుకు హరితహారం కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం ద్వారా మూడేళ్లలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ధేశించుకున్నామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో అడవుల అభివృద్ధి, సంరక్షణకు చేపడుతున్న చర్యలను అటవీశాఖ అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సదస్సుకు వివరించారు. మూడు రోజుల పాటు జరిగే సదస్సులో తొలిరోజు జరిగిన కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల అటవీ శాఖ మంత్రులతో పాటు రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పీసీసీఎఫ్ అధికారి మిశ్రా, వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ పీకే శర్మ పాల్గొన్నారు.
నవంబర్‌లో మరో సదస్సు
నేషనల్ వైల్డ్‌లైఫ్ క్రైం కంట్రోల్ బ్యూరో స్థానంలో దక్షిణాది రాష్ట్రాల అటవీ సమస్యల పరిష్కారం కోసం ‘రీజనల్ వైల్డ్‌లైఫ్ క్రైం కంట్రోల్ బ్యూరో’ను ఏర్పాటు చేయాలని సదస్సులో ప్రతిపాదించారు. సమాచారం, విజ్ఞానం, అనుభవాలను పంచుకునేందుకు, సమస్యలను అధిగమించేందుకు దక్షిణాది రాష్ట్రాల అటవీ శాఖ మంత్రుల కౌన్సిల్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. కాగా, ఈ ఏడాది నవంబర్‌లో హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల అటవీ శాఖ మంత్రుల సదస్సును మరోసారి నిర్వహించనున్నారు.