శాసన సభలో నోళ్లు నొక్కారు
* ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
వరంగల్ చౌరస్తా : ప్రజా సమస్యలను లేవనెత్తకుండా అసెంబ్లీలో సీఎం, మంత్రులు ప్రతిపక్షాల నోళ్లు నొక్కారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. వరంగల్‌లోని 21వ డివిజన్ కృష్ణా కాలనీలో సోమవారం ఇంటింటా బీజేపీ సభ్యత్వ నమోదు పరిశీలన కోసం విచ్చేసిన ఆయన పలువురికి సభ్యత్వాలు అందించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉందన్నారు. ఆరు నెలల తెలంగాణ ప్రభుత్వ పాలన ప్రజలను అయోమయానికి గురిచేస్తోందన్నారు. సర్వేల పేరుతో అర్హుల పింఛన్లు తొలగించారన్నారు.
వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, ఆరు నెలల్లో 520 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కనీసం వారి కుటుంబాలను కూడా పరామర్శించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి విషయంలో రాష్ర్ట ప్రభుత్వానికి సహకరిస్తుందని తెలిపారు. అలాగే వరంగల్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈనెల 20న రానున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం రామచంద్రారెడ్డి కృష్ణా కాలేజీ విద్యార్థినులతో ముచ్చటించారు.
పార్టీ అర్బన్ అధ్యక్షుడు చింతాకుల సునీల్ మాట్లాడుతూ నగరంలోని దళితవాడలో ఈనెల 7న సహపంక్తి భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. నగరంలో 1.20లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు సైనికుల్లా పనిచేస్తున్నారని తెలిపారు. సమావేశంలో రాష్ర్ట కమిటీ సభ్యుడు చాడ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బాకం హరి శంకర్, ఎరుకాల రఘునారెడ్డి, పోట్టి శ్రీనివాస్ గుప్తా, బైరి శ్యాంసుందర్ పాల్గొన్నారు.
జోరుగా సభ్యత్వ నమోదు
హన్మకొండ : జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పిలుపు మేరకు కార్యకర్తలు, నాయకులు సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించారు. తొలుత నవంబర్ 30, డిసెంబర్ 1,2 తేదీల్లో నిరంతరాయంగా సభ్యత్వ నమోదు చేయించాలని పార్టీ నిర్ణయం తీసుకొంది. దీంతో మొదటి రోజు సీనియర్, జాతీయ, రాష్ర్ట నాయకులు వారి సొంత నియోజకవర్గాల్లో, సొంత బూత్‌లలో సభ్యత్వం చేయించి.. మిగతా రెండు రోజులు వారికి కేటాయించిన ప్రాంతాల్లో సభ్యత్వ నమోదు పర్యవేక్షించాలని పార్టీ ఆదేశించింది.
ఈ మేరకు సోమవారం జిల్లాలో రాష్ర్ట నాయకులు విస్తృతంగా పర్యటించారు. బీజేపీ శాసనసభ పక్ష ఉప నేతలు ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు ఆచారి, డాక్టర్ మల్లారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామిగౌడ్ జిల్లాలో పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.