రాజధానిలోనే మకాం..!
కొన్నాళ్లుగా హైదరాబాద్‌లోనే ముష్కరుల అడ్డా
అప్రమత్తమైన నగర పోలీసులు.. మిగతా వారి కోసం గాలింపు
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేటలో పోలీసులను కాల్చి పరారై.. జానకీపురం ఎన్కౌంటర్లో హతమైన ముష్కరులు కొన్నాళ్లుగా హైదరాబాద్‌లోనే మకాం వేసినట్లుగా తెలుస్తోంది. ఖాండ్వా జైలు నుంచి పారిపోయిన వారిలో అస్లాం, జకీర్‌లు జానకీపురం ఎన్కౌంటర్లో మృతి చెందగా... ఫైజల్, అబీద్ గతేడాదే పోలీసులకు చిక్కారు. మిగిలిన మహబూబ్, అంజద్, ఇజాజ్‌లు నేటికి పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు సూర్యాపేట కాల్పుల ఘటన తర్వాత అస్లాం, జకీర్‌లతో కలిసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మరో ఇద్దరు కూడా హైదరాబాద్‌లో మకాం వేసి ఉండవచ్చనే అనుమానాలున్నాయి. దీంతో హైదరాబాద్ పోలీసులతో పాటు నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ ముఠా హైదరాబాద్‌ను షెల్టర్‌గా చేసుకుంటే... వారికి ఎవరు సహకరించారనే దిశగా కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక అస్లాం, జకీర్‌ల వద్ద లభించిన రెండు సెల్ఫోన్లకు సంబంధించిన కాల్ లిస్టును పోలీసులు పరిశీలిస్తున్నారు. అందులోని నంబర్ల ఆధారంగా హైదరాబాద్‌లో జల్లెడ పట్టడంలో ఉన్నారు.
వారిద్దరూ హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్టాండ్ (ఎంజీబీఎస్) ఔట్‌గేట్ వద్ద గిద్దలూరు వెళ్తున్న బస్సు ఎక్కారని ఆ బస్సు డ్రైవర్లు మహేందర్‌రెడ్డి, ప్రసాద్‌లు పోలీసులకు వాం గ్మూలం ఇచ్చారు. జానకీపురం ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిలో ఒక ముష్కరుడి వద్ద గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించిన రైలు టికెట్ లభించింది. అంటే సూర్యాపేట కాల్పుల ఘటన తర్వాత ఒకరు వచ్చి వీరితో కలిశారు. అతను గురువారం సాయంత్రం 3.45 గంటలకు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ప్రయాణించి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు నాంపల్లి రైల్వేస్టేషన్ వచ్చాడు. అక్కడి నుంచి నల్లగొండ జిల్లాలో సంచరిస్తున్న తమ సహచరులను కలుసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే జానకీపురం ఎన్‌కౌం టర్లో హతమైంది ఇద్దరు మాత్రమే కాబట్టి... మరొకరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.