పెళ్లింట్లో విషాదం
తండ్రి మృతితో ఆగిన కూతురు వివాహం
మూడుచెక్కలపల్లిలో ఘటన
నల్లబెల్లి : కూతురును అన్ని లాంఛనాలతో అత్తారింటికి సాగనంపేందుకు ఆ తండ్రి ఏర్పాట్లు చేశాడు.. ఇంకో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి పందిరితో ఇల్లు కళకళలాడుతోంది.. ఈ క్రమంలో పెళ్లి బట్టలు కొనుగోలు చేస్తుండగా వధువు తండ్రికి గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆయన మార్గమధ్యలో మృతి చెం దాడు. దీంతో పెళ్లింట్లో విషాదం అలుముంది. శుక్రవారం నల్లబెల్లి మండలం గోవిందపూర్ శివారు మూడుచెక్కలపల్లిలో జరిగిన ఈ సంఘటన ఇరుకుటుంబాల్లో విషాదం నింపింది. మూడుచెక్కలపల్లి తండాకు చెందిన భూక్య కోబాల్సింగ్(40), మంగమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
కూతురు అరుణకు గూడూరు మం డలం గుండెంగ గ్రామానికి చెందిన యువకుడితో మార్చి 6న పెళ్లి చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఇరుకుటుంబాల వారు బంధువులతో కలిసి నర్సంపేటలో పెళ్లి బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. కొంత కాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్న కోబాల్సింగ్ పెళ్లి పనుల్లో అలసటకు గురై చాతినొప్పి వస్తోందంటూ ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కోబాల్సింగ్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.