ఇంటర్నేషనల్ స్కూలు కలేనా..?
నాలుగు నెలలుగా ఒక్క సంస్థా ముందుకు రాని వైనం
చంద్రశేఖరపురం(కొడవలూరు):
చంద్రశేఖరపురంలో ఇంటర్నేషనల్ స్కూలు ఏర్పాటు కథ కంచికి చేరినట్లేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి పెయ్యలపాలెం రోడ్డులోని 16.06 ఎకరాల ప్రభుత్వ భూమిని గత ఏడాది ఆగస్టులో ఇంటర్నేషనల్ స్కూలు కోసం ప్రతిపాదించారు. ఇది ఇంటర్నేషన్ స్కూలుకు అనువైనదని రాష్ట్ర అధికారులు కూడా నిర్ధారించారు. స్కూలు ఏర్పాటవుతుందని ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సమీప గ్రామాలవారు కూడా సంతోషించారు. అయితే ఇప్పటి దాకా ఒక్క సంస్థ మాత్రమే స్కూలు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి విముఖత వ్యక్తం చేసింది. ఆ తరువాత నాలుగు నెలలు గడుస్తున్నా ఒక్క సంస్థ కూడా స్థలాన్ని పరిశీలించకపోవడంతో స్కూలు కథ కంచికి చేరిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
స్కూల్ ఏర్పాటుకు స్థలం అనువుగా ఉందని నిర్ధారణ
ఈ స్థలాన్ని గతేడాది ఆగస్టులో స్కూలుకు ప్రతిపాదించాక అదే నెలలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ స్పెషల్ డిప్యూటి కలెక్టర్ ఎం.విజయసునీత స్థలాన్ని పరిశీలించి ఇంటర్నేషనల్ స్కూలుకు ప్రదిపాదిత స్థలం అనువుగా ఉందని నిర్ధారించారు. ఆ తరువాత వివిధ ఇంటర్నేషనల్ స్కూళ్ల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపారు. అందులో భాగంగా ఈ స్థలాన్ని వివిధ సంస్థలు చూడడం జరిగింది. స్థలాన్ని పలు సంస్థలు పరిశీలిస్తుండడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆశలు స్థానికుల్లోనూ చిగురించాయి. అయితే ఏ సంస్థ కూడా స్కూలు ఏర్పాటుకు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 24న ర్యాన్ అనే ఇంటర్నేషనల్ సంస్థ ఆపరేషన్స్ అ«ధికారి శ్రీనివాసన్ ఈ స్థలాన్ని పరిశీలించారు. స్థలాన్ని పరిశీలించిన ఆయన నెల్లూరు నగరానికి సుమారు 20 కిమీ దూరంలో స్థలం ఉన్నందున ఇంటర్నేషనల్ స్కూలు నిర్మించడం కష్టమనే అభిప్రాయాన్ని రెవెన్యూ అధికారుల వద్ద వ్యక్తం చేశారు. దీంతో స్కూలు ప్రతిపాదన మరుగుపడినట్లైంది. సమీప గ్రామాల వారిలో నిరాసక్తత నెలకొంది.
స్కూలు ఏర్పాటు ఖరారు కాలేదు: ఎస్.వెంకటేశ్వరరావు, తహసీల్దార్
ఇంటర్నేషనల్ స్కూలుకు ప్రతిపాదించిన స్థలాన్ని ఇప్పటికే వివిధ సంస్థలు పరిశీలించాయి. అయితే వారు స్కూలు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ స్కూలు ప్రతిపాదిత స్థలం స్కూలు ఏర్పాటుకు అన్ని విధాలా అనువుగా ఉన్నందున వేచి చూడాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.