Komaram Bheem Express
-
ఇక ఏపీ, తెలంగాణ, కొమురం భీమ్ ఎక్స్‌ప్రెస్‌లు
ఇకనుంచి రెండు తెలుగు రాష్ట్రాలనుంచి దేశరాజధాని ఢిల్లీకి వేర్వేరుగా సర్వీసులు నడపనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్లే కొత్త సర్వీసును ఏపీ ఎక్స్‌ప్రెస్‌గా పరిగణించాలని, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే సర్వీసును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా వ్యవహరించాలన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై గురువారం ఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించిన వెంకయ్య.. ఈ మేరకు నిర్ణయాలను వెలువరించారు. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లే రైలుకు ప్రస్తుత పేరు (తెలంగాణ ఎక్స్‌ప్రెస్) ను తొలిగించి కొమరం భీం ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశామన్నారు. విశాఖకు కొత్తరైల్వే జోన్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి సురేశ్ ప్రభును కోరినట్లు తెలిపారు. తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు వివరించారు. హుద్‌హుద్ తుఫాన్ ధాటికి దెబ్బతిన్న వైజాగ్ ఎయిర్‌పోర్టు మరమ్మతులు ఈనెల చివరినాటికి పూర్తవుతాయన్నారు. -
ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చరా?
* అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్రానికి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ * తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టాలని విజ్ఞప్తి.. * కాగజ్‌నగర్ వెళ్లే రైలుకు కొమురం భీం పేరు సూచన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఆరు నెలలవుతున్నా రాజధాని నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ఎక్స్‌ప్రెస్ రైలు పేరును మార్చకపోవడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రైలు పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ లేఖ కూడా రాశారు. అయినా కేంద్రం స్పందించకపోవడంతో తాజాగా కేసీఆర్ స్వయంగా రైల్వే మంత్రికి గురువారం లేఖ రాశారు. ప్రస్తుతం హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడుస్తున్న రైలును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా పిలుస్తున్న నేపథ్యంలో దాని పేరును కొమురం భీం ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని, ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు తెలంగాణ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి తన లేఖలో కేంద్రాన్ని కోరారు. రాష్ర్టం ఏర్పాటై ఆరు నెలలు గడుస్తున్నా హైదరాబాద్-న్యూఢిల్లీ రైలుకు ఏపీ పేరునే కొనసాగించడం సరికాదని ఆయన పేర్కొన్నారు.