మహిళలకు జూడో చాలా అవసరం
మాజీ మంత్రి కుతూహలమ్మ వెల్లడి
తిరుపతిలో మొదటి సబ్ జూనియర్ జూడో పోటీలు ప్రారంభం
తిరుపతి స్పోర్ట్స్ : విద్యార్థి దశ నుంచే ప్రతి మహిళకు జూడో వంటి క్రీడలు చాలా అవసరమని మాజీ మం త్రి డాక్టర్ గుమ్మడి కుతుహలమ్మ తెలిపారు. మొదటి సబ్ జూనియర్ అంతర జిల్లాల జూడో చాంపియన్ షిప్-2014 పోటీలు గురువారం తిరుపతిలో ప్రారంభించారు. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ పోటీలను మాజీ మంత్రి కుతుహలమ్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.భానుప్రకాష్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూడో వంటి క్రీడలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు. ఏపీ జూడో అసోసియేషన్ చైర్మన్ వై.హరీష్ చంద్రప్రసాద్ మాట్లాడుతూ జూడోతో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. మహిళలపై రోజూ ఏదో ఓ చోట లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మహిళా జూడో నేర్చుకోవడం వలన అలాంటి దాడులను ధై ర్యంగా ఎదుర్కోవచ్చన్నారు. రాష్ట్రం విడిపోయాక 13 జిల్లాల్లోని క్రీడాకారులకు తిరుపతిలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు నిర్వహించడం శుభపరిణామం అన్నారు. అనంతరం జూడో పాటీలను నిర్వాహకులు లాంఛనంగా ప్రారంభించారు.
సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి దాదాపు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయి. జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నామిశెట్టి వెంకట్, ప్రధాన కార్యదర్శి కేఎన్.బాబు, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్.రాజేష్, అధ్యక్షులు కృష్ణమూర్తి, కార్యదర్శి సి.కిరణ్‌కుమార్‌తో పాటు రైల్వే డీ ఆర్సీసీ సభ్యులు గుండ్లూరి వెంకటరమణ, స్విమ్స్ డాక్టర్ మునస్వామి, వరప్రసాద్, పి.భాస్కర్, పుష్పలత పాల్గొన్నారు.