రైల్వే కార్మికుల సమ్మె వాయిదా
- ఎన్ఎఫ్ఐఆర్ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య వెల్లడి
హైదరాబాద్: ఏడో వేతన సంఘం ఏర్పాటుపై రైల్వే యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రావడంతో కార్మికుల సమ్మెను వాయిదా వేసినట్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ జాతీయ ప్రధానకార్యదర్శి మర్రి రాఘవయ్య తెలిపారు. గురువారం కాచిగూడలోని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో జరిగిన కాచిగూడ హెడ్ క్వార్టర్స్, ఐదు బ్రాంచీల కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రైల్వే ఉద్యోగులు, కార్మికుల వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారానికి ఏడో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీతో 4 నెలలపాటు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈలోగా సమస్యలు పరిష్కారంకాని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని, సమ్మె చేపడతామని ఆయన హెచ్చరించారు. రైల్వేలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నామన్నారు. రైల్వే వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి యత్నిస్తే ఊరుకోబోమని హెచ్చరించా రు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ సంఘ్ హైదరాబాద్ డివిజన్ డిప్యూటీ డివిజనల్ కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వర్లు, నాయకులు భరణి భానుప్రసాద్, భిక్షపతి, కేవీఆర్ ప్రసాద్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.