పల్లె పీఠంపై ఆడబిడ్డలుదశ మార్చండి!
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పంచాయతీ ఎన్నికల్లో మహిళలు విజయభేరి మోగించారు. గత నెల మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో తమ సత్తాచాటారు. జిల్లావ్యాప్తంగా ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 866 పంచాయతీ, 8,732 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొదటి, రెండు, మూడు విడతల్లో ఎన్నికలు జరగగా 480 మంది మహిళలు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం మహిళల రిజర్వేషన్‌ను 33 శాతం నుంచి 50 శాతానికి పెంచడంతో అవకాశాన్ని వినియోగించుకున్నారు. 50 శాతం రిజర్వేషన్ అంటే 433 సర్పంచ్ స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యాయి. 433 రిజర్వేషన్ స్థానాలతోపాటు మరో 47 జనరల్‌లో సర్పంచ్ స్థానాలను దక్కించుకున్నారు. అంటే కోటా కంటే 10 శాతం అధికంగా అధికారం సాధించారు. కాగా, ఏకగ్రీవ పంచాయతీల్లోనూ మహిళలే అధికంగా అధకారం కైవసం చేసుకున్నారు. సుమారు 50 శాతం పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్ పదవుల్లో మహిళలే ప్రాతినిధ్యం వహిస్తుండడం ఆసక్త్తికరంగా మారింది. కాగా వర్షం, వరదల కారణంగా ఇంకా 25 పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. వీటిలో కూడా ఐదారు సర్పంచ్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది.
మహిళలు అధికారం మీదే..
మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రజలు భావిస్తున్నారు. రాజకీయంగా అన్ని అధికారాలను వినియోగించుకుని పల్లెలను ప్రథమ స్థానంలో నిలుపుతారని ఆశిస్తున్నారు. భర్త చాటు భార్యలు కాకుండా సొంతంగా పాలన చేయాలని కోరుతున్నారు. తమకు పదవులు ఇచ్చినందుకు గ్రామాల్లో పారిశుధ్యం, వీధిదీపాలు, రహదారులు, మంచినీటి సౌకర్యం వంటి తదితర సౌకర్యాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. పాలన భేష్‌గా చేస్తే 50 శాతం రిజర్వేషన్‌కు సార్థకత చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, కొత్తగా ఎన్నికైనా మహిళా సర్పంచ్‌లకు ప్రభుత్వం గ్రామ పంచాయతీ పరిపాలన విధానంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, విధుల నిర్వహణ, వివిధ అభివృద్ధి పనుల కోసం మంజూరు చేయబడే నిధుల ఖర్చులపై అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య తెలిపారు.