‘ల్యాంకో’ భూములను స్వాధీనం చేసుకోవాలి
హైదరాబాద్: ల్యాంకో హిల్స్ భూములు నూటికి నూరు శాతం వక్ఫ్ భూములేనని, వాటిని స్వాధీనం చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. సచివాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన సీఎం కేసీఆర్ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... గురుకుల్ ట్రస్టు భూముల్లో ఆక్రమణల తొలగింపు సరైనదేనని, ఇళ్లను కట్టుకున్నవాళ్లు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకపోవడం తప్పేనన్నారు.
అయితే, మణికొండలోని వందల ఎకరాల వక్ఫ్ భూముల్లో 60 అంతస్తుల ఆకాశహర్మ్యాలు కడుతున్న ల్యాంకో హిల్స్ సంగతేంటని ముఖ్యమంత్రిని అడిగినట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లు తెలంగాణలో ఆక్రమణలకు గురైన భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవాలన్నారు. కాగా, చాక్లెట్ కోసం చిన్నపిల్లవాడు వెళ్లినట్లుగా తమ ఎమ్మెల్సీలు పార్టీ మారారని విమర్శించారు. ఎవరు వెళ్లిపోయినా కాంగ్రెస్కు వచ్చిన నష్టమేమి లేదన్నారు