‘ట్రాఫిక్’ వేధింపులపై ఆటోవాలాల ర్యాలీ
శంషాబాద్: పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారని నిరసిస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఆటోవాలాలు భారీ ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసులు అడగడుగునా ఛలాన్లు విధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని సామ ఎన్క్లేవ్ నుంచి ప్రారంభమైన ఆటోల ర్యాలీ జాతీయ రహదారి మీదుగా ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ వరకు నిర్వహించారు. సుమారు 300 ఆటోలు ర్యాలీలో పాల్గొన్నాయి. స్థానిక అవసరాల కోసం ఆటోలు ఆపినా పోలీసులు ఛలాన్లు వేయడంతో పాటు ఆటోల్లోని సీట్లను లాగేసి, అద్దాలు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం బీఎంఎస్ నాయకులు శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ సతీష్‌తో చర్చలు జరిపారు. ఆటో డ్రైవర్లకు లెసైన్సులు తప్పనిసరిగా ఉండాలని ఈ సందర్భంగా ఏసీపీ సూచించారు.
ఆటోలు నిలుపుకోడానికి స్థానికంగా ప్రత్యామ్నాయ స్థలాలు చూపాల్సిన అవసరముందని బీఎంఎస్ నాయకులు కోరారు. ఆటోలను జీవనాధారంగా చేసుకొని వందలాది మంది బతుకుతున్నారని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లపై వేధి ంపులు మానుకోవాలని కోరారు. అనంతరం శంషాబాద్ లా అండ్ ఆర్డర్ ఏసీపీ అనురాధకు బీఎంఎస్ మండల అధ్యక్షుడు చింతల నందకిశోర్ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సయ్యద్, జగన్, దేవేందర్, సర్వర్, ఫయాజ్, నాగరాజు, రంజిత్, నర్సింహారెడ్డి, రాజుగౌడ్, జంగయ్య, అంజి, శేఖర్, ప్రవీణ్‌కుమార్ వినతిపత్రం ఇచ్చారు.