దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక..
– పురుగులమందు తాగి రైతు బలవన్మరణం
– గుండాల మండల పరిధిలో ఘటన
పెద్దపడిశాల (గుండాల)
కలిరాని కాలం మరో రైతు ఉసురుతీసింది. వర్షాభావ పరిస్థితులకు దగుబడి రాక..వ్యవసాయ పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చలేక పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆలేరు మండల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. మండలంలోని పెద్దపడిశాల గ్రామానికి చెందిన ఆకుల పెద్దరాములు (58) తనకున్న ఏడు ఎకరాలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎకరం భూమిలో వరి, రెండు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల నిమిత్తం రూ.8 లక్షల వరకు అప్పు చేశాడు. పది బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు. నీటివసతి లేకపోవడంతో దిగుబడి రాలేదు. ఈ నేపథ్యంలోనే అప్పుల వారి ఒత్తిడి పెరిగిపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. శనివారం రాత్రి తన వ్యవసాయ బావి వద్దనే పెద్దరాములు పురుగులమందు తాగాడు. చుట్టు పక్కల రైతులు గమనించడంతో అప్పటికే మృతిచెందాడు. హెడ్ కానిస్టేబుల్ మైసయ్య శవ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి పెద్ద కుమారుడు ఆకుల యాదగిరి ఫిర్యాదు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.