ఆన్లైన్ ద్వారా ఇక నగదు చెల్లింపులు
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే అన్నిరకాల చెల్లింపులలో జాప్యాన్ని నివారించేందుకు త్వరలో ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్ర ట్రెజరీస్ డెరైక్టర్ కె.కనకవల్లి తెలిపారు. ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం, విజయనరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ట్రెజరీ అధికారులు, సిబ్బందికి ఆదివార ం బుల్లయ్య కళాశాలలో ఏర్పాటైన శిక్షణ శిబిరంలో మాట్లాడారు. రాష్ట్రంలో 5 లక్షల మంది వరకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, 3.5 లక్షల మంది పెన్షనర్లకు ఇకపై ప్రతినెలా చె ల్లింపులు ఆన్లైన్ ద్వారానే జరుగుతాయన్నారు.
విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, థర్డ్ పార్టీ చెల్లింపులు కూడా ఆన్లైన్ ద్వారా నేరుగా వారివారి బ్యాంకు అకౌంట్లకు జమ అవుతాయన్నారు. ఆన్లైన్ విధానంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ట్రెజరీస్ అదనపు సంచాలకుడు హనుమంతరావు, సంయుక్త సంచాలకుడు డాక్టర్ ఎ.శివప్రసాద్, అసిస్టెంట్ డెరైక్టర్లు ఎస్.వి.ఎన్.కల్యాణి, జి.అచ్చుతరామయ్య , విశాఖ జిల్లా ఖజానా ఉప సంచాలకులు ఎం.గీతాదేవి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఎ.శ్రీనివాస్, కె.కేదార్, ఎస్బీఐ సీనియర్ మేనేజర్ వెంకటరావు, మూడు జిల్లాల డెప్యూటీ డెరైక్టర్లతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.