అ‘టెన్’షన్
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఉవ్వెత్తున ఎగసిన సమైక్యాంధ్ర ఉద్యమం పర్యవసానంగా విద్యా సంబంధ కార్యక్రమాలు స్తంభించిపోయాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచి ఉపాధ్యాయులంతా సమ్మెలో పాల్గొనడంతో ప్రభుత్వ పాఠశాలలు దాదాపుగా మూతపడ్డాయి. దాంతో 30రోజుల పాటు అన్ని తరగతులతో పాటు టెన్త్ విద్యార్థులు సైతం పాఠశాలలకు దూరం కావాల్సి వచ్చింది. అనుకున్న సమయానికి కోర్సులు పూర్తికాకపోవడంతో క్వార్టర్లీ పరీక్షల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ప్రస్తుతం ఉపాధ్యాయులంతా సమ్మెకు స్వస్తి చెప్పి విధుల్లోకి చేరడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువును గాడిన పడేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చకచకా కోర్సులు పూర్తి చేయించే అంశంపై దృష్టి సారించారు. ఎప్పటి మాదిరిగా అనుకున్న సమయానికి పాఠాలన్నీ పూర్తి చేయించి, విద్యార్థుల చేత పునశ్చరణ చేయించి, పబ్లిక్ పరీక్షలకు వారిని సన్నద్ధం చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే పదోతరగతి రెగ్యులర్ విద్యార్థులు సుమారుగా 60వేల మం ది వరకు ఉంటారు. వీరిలో సుమారుగా 40వేల మంది విద్యార్థులు ప్రభు త్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. నెల రోజుల పాటు వీరికి పాఠాలు జరగలేదు. దాంతో తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై పడింది. ఇందుకోసం సంక్రాంతి సెలవులలతో పాటు ఆదివారాలు సైతం పాఠశాలలు నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఉపాధ్యాయులు కూడా ముందుకు వచ్చారు. అంతా కలసి పదో తరగతి కోర్సులను జనవరి 15కల్లా పూర్తిచేయాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. ఇది క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నదీ ప్రత్యేక బృం దాల పర్యవేక్షణలో పరిశీలించాలని నిర్ణయించారు. దీనిపై ఇన్చార్జి డీఈ వో లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ కోర్సులను వీలైనంత తొందర్లో పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. పూర్తయిన కోర్సులను బట్టి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేశారు.