దేశ భద్రత మొత్తం ఉత్తరాఖండ్ చేతిలో..!
డెహ్రాడూన్: దేశ భద్రత మొత్తం ఉత్తరాఖండ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. మరేం లేదు.. దేశ రక్షణకు సంబంధించిన అత్యున్నత పోస్టులన్నీ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులే కైవసం చేసుకున్నారు. సహజంగానే దైవ భూమి, వీరభూమి అనే పేరున్న పర్వతాలమయమైన ఉత్తరాఖండ్.. పౌరుషాలకు పెట్టింది పేరు. ఇక్కడ నుంచి ఎంతోమంది భారత ఆర్మీలో, జాతీయ భద్రతా దళంలో, పోలీసు విభాగంలో ఉన్నారు. తాజాగా దేశ సైన్యాధ్యక్షుడిగా ఎంపికైన లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్, రా బాస్ గా ఎంపికైన అలిల్ ధస్మానా కూడా ఉత్తరాఖండ్‌కు చెందిన వారే కావడం విశేషం.
వీరిద్దరు కూడా పౌరీ గర్వాల్ జిల్లాకు చెందినవారు కావడం మరింత చెప్పుకోదగిన విషయం. ఇంకా జాతీయ భద్రతా సలహా దారుగా వ్యవహరిస్తున్న అజిత్ దోవల్ కూడా పౌరీ గర్వాల్లోని గిరి బానెల్సియన్ ప్రాంతానికి చెందినవారు. ఒక కోస్టు గార్డు చీఫ్ గా పనిచేస్తున్న రాజేంద్ర సింగ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ అనిల్ భట్ ఇలా చాలా మంది రక్షణ విభాగంలో ఉన్నతాధికారులుగా ఎంపికై విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిపై మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత, ఆర్మీలో కూడా పనిచేసి రిటైర్డ్ అయిన మేజర్ జనరల్ బీసీ ఖండూరి స్పందిస్తూ ఇది తమ రాష్ట్రానికి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.