చాంపియన్‌లా చెలరేగి...
► రెండో విజయంతో ప్రిక్వార్టర్స్‌లోకి స్పెయిన్
► టర్కీపై 3-0తో గెలుపు యూరో కప్
నైస్ (ఫ్రాన్స్): వరుసగా మూడో టైటిల్ వేటలో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ యూరో కప్‌లో తొలిసారిగా తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించింది. ప్రత్యర్థిపై అన్ని విభాగాల్లో రాణించడంతో పాటు ఫార్వర్డ్ ఆటగాడు అల్విరో మొరాటా తన విమర్శకులకు సమాధానం చెబుతూ ఏకంగా రెండు గోల్స్‌తో మెరిశాడు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి టర్కీతో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 3-0తో ఏకపక్ష విజయాన్ని అందుకుంది. చెక్ రిపబ్లిక్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అందివచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయిన మొరాటా (34, 48వ నిమిషాల్లో) ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో దుమ్మురేపగా... నోలిటో (37) ఓ గోల్ చేశాడు.
అయితే తమ జట్టు ఓటమి అనంతరం టర్కీ అభిమానులు అలజడిని సృష్టించారు. స్టేడియంలోనికి క్రాకర్స్ విసిరారు. గ్రూప్ ‘డి’ విభాగంలో జరిగిన ఈ మ్యాచ్ ప్రథమార్ధమంతా స్పెయిన్ ఎదురుదాడే సాగింది. 11వ నిమిషంలో పీకే హెడర్ లక్ష్యాన్ని తాకలేకపోయింది. 25వ నిమిషంలో హకన్ కల్హనోగ్లు ఫ్రీకిక్ స్పెయిన్ గోల్బార్ పైనుంచి వెళ్లింది. అయితే మూడు నిమిషాల వ్యవధిలో స్పెయిన్ రెండు గోల్స్ సాధించి టర్కీకి షాక్ ఇచ్చింది. ద్వితీయార్ధం ప్రారంభమైన మూడో నిమిషంలోనే మొరాటా మళ్లీ మెరిశాడు. గోల్ పోస్ట్‌కు ఆరు గజాల దూరం నుంచి బంతిని నెట్‌లోనికి పంపడంతో జట్టుకు తిరుగులేని ఆధిక్యం లభించింది.
బెల్జియం బోణీ: యూరో కప్‌లో బెల్జియం బోణీ చేసింది. ఇటలీతో తమ తొలి మ్యాచ్‌ను ఓడిన ఈ జట్టు గ్రూప్ ‘ఇ’లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-0తో నెగ్గింది. తమ నాకౌట్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. లూకాక్ (48, 70వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో రెచ్చిపోగా.. ఏక్సెల్ విట్సెల్ (61) మరో గోల్ చేశాడు.
ఐస్లాండ్ చేజేతులా: గ్రూప్ ‘ఎఫ్’లో భాగంగా శనివారం హంగేరి జట్టుతో జరిగిన మ్యాచ్‌ను ఐస్లాండ్ 1-1తో ‘డ్రా’ చేసుకుంది. 40వ నిమిషంలో లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకున్న గిల్ఫీ సిగుర్డ్సన్ తమ జట్టుకు గోల్ అందించాడు. అయితే 88వ నిమిషంలో ఐస్లాండ్ ప్లేయర్ సెవార్సన్ ‘సెల్ఫ్ గోల్’ చేయడంతో మ్యాచ్ ‘డ్రా’ అయింది.
‘యూరో’లో నేడు
గ్రూప్ ‘ఎ’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు
రొమేనియా x అల్బేనియా
రాత్రి గం. 12.30 నుంచి సోనీ ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఫ్రాన్స్ x స్విట్జర్లాండ్
రాత్రి గం. 12.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం