కమల విలాపం
నిట్ట నిలువునా చీలిన జిల్లా బీజేపీ
నగరశాఖలోనూ అవే లుకలుకలు
ఒకేఅంశంపై వేర్వేరు కుంపట్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
కమలనాథులు కత్తులు దూసుకుంటున్నారు. కేంద్రంలో అధికారం ఉందనే వెలుగు తప్ప జిల్లాలో చెప్పుకోదగ్గ క్యాడర్, ప్రాభవం ఆ పార్టీకి లేదనే చెప్పాలి. అందివచ్చిన అవకాశంతో ఒక్కో మెట్టు పైకెక్కాలని ఎక్కడైనా ఆలోచిస్తారు. కానీ కమలనాథుల ఆలోచనలు అలా కనిపించడం లేదు. రెండు గ్రూపులతో పార్టీ నిట్ట నిలువునా చీలిపోయింది. గ్రూపుల మధ్య ఒకరకంగా పెద్ద వార్ జరుగుతోంది. గత ఫిబ్రవరిలో పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక రేపిన చిచ్చు చల్లారలేదు. గ్రూపులు మరింత బలపడి పార్టీ సమావేశాలు సైతం వేర్వేరుగా పెట్టుకునే పరిస్థితి జిల్లాలో నెలకొంది. సహజంగా బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి దాదాపు ఎప్పుడూ ఏకగ్రీవమవుతోంది. గత ఫిబ్రవరిలో తొలిసారి ఆ పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కూడా బాహాబాహీ తలపడ్డారు. పార్టీ కిసాను మోర్చా నాయకుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్యను ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. కాంగ్రెస్ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆల్డా చైర్మను యాళ్ల దొరబాబును పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైడా కృష్ణమోహను బలపరిచి బరిలోకి దింపారు. తొలుత రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిక్కిన విశ్వేశ్వరరావుకు జిల్లా పగ్గాలు ఏకగ్రీవంగా అప్పగించాలని నేతలు దాదాపు ఓ నిర్ణయానికి వచ్చారు.
వేర్వేరు కుంపట్లే..
విశాఖ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభం పాటి హరిబాబు వర్గంగా ముద్రపడ్డ బిక్కిన ఎన్నిక ఏకగ్రీవమైతే రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న ఎమ్మెల్సీ వీర్రాజుకు జిల్లా నుంచి ప్రతిబంధకమవుతుందనే ముందుచూపుతో ఆ వర్గం వ్యతిరేకించింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీ వీర్రాజు బలపరిచిన పార్టీ రాష్ట్ర కిసానుమోర్చా ప్రధాన కార్యదర్శి ఎనిమిరెడ్డి మాలకొండయ్య విజయం సాధించారు. అప్పటినుంచీ పార్టీ జిల్లాలో రెండుగా చీలిపోయింది. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలు, చివరకు మీడియా సమావేశాలు కూడా వేర్వేరుగానే పెట్టే పరిస్థితి ఏర్పడింది. కాకినాడ పద్మనాభ ఫంక్షను హాలులో మే నెలలో మోదీ వికాస్ పర్వ్ కార్యక్రమం నిర్వహించా రు. దీనికి కేంద్ర ఐటీ శాఖా మంత్రి రవిశంకర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమకు ఆహ్వానం లేదనే కారణంతో పైడా కృష్ణమోహను వర్గం ఈ కార్యక్రమానికి పూర్తిగా డుమ్మా కొట్టింది. అదేవిధంగా కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భగా ఇటీవల కాకినాడ పైడా కల్యాణ మండపంలో జరిగిన విజయ సంకల్ప సభలో కూడా కృష్ణమోహను వర్గం కనిపించ లేదు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన మంత్రి మాణిక్యాలరావు వర్గపోరు పడలేక సామర్లకోట వరకూ వచ్చి తిరిగి వెళ్లిపోయారు. కాకినాడ ఆర్అండ్బీ అతిథి గృహంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్‌లు ఇటీవల జరిగిన సమావే శానికి హాజరయార్యరు. వారి సమక్షంలోనే ఈ రెండు గ్రూపుల మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యం లేకుండా చేయడం, కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌గా మచ్చా గంగాధర్ నియామకం తదితర విషయాల్లో ఎమ్మెల్సీ సోము వర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తోందనేది పైడా వర్గం ప్రధాన ఆరోపణ. ఈ రెండు గ్రూపుల మధ్య నెలకొన్న విభేదాలను స్వయంగా ఆ పార్టీ జిల్లా ఇనుఛార్జి పూడి తిరుపతిరావు ఆ సమావేశంలో అంగీకరించడం గమనార్హం. విభేదాలను త్వరలో చక్కదిద్దుతామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒక కేసులో నిందితుడిగా ఉన్న సాయిబాబా పార్టీ కాకినాడ నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీలో జూనియర్ అయిన పెద్దిరెడ్డి రవికిరణ్ నియామకంలో వీర్రాజు వర్గం ఏకపక్షంగా వ్యవహరించిందని కృష్ణమోహను వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వచ్చే నెల 4న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాకినాడ రానున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం గురువారం పార్టీ నేతలు కాకినాడలో 49వ డివిజ¯ŒSలో కృష్ణమోహను వర్గీయులు ఉంగరాల చినబాబు, సాయిబాబా తదితరులు సమావేశమయ్యారు. అదే సమయంలో వీర్రాజు వర్గంగా ముద్రపడ్డ మాలకొండయ్య, రవికిరణ్‌లు ఆర్అండ్బీ అతిథి గృహంలో సమావేశమవడం చూస్తే కమలనాథుల్లో రెండు గ్రూపులు ఉన్న విషయం తేటతెల్లమవుతోంది. ఒకే అజెండాపై ఇద్దరూ వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేయడం పార్టీలో వైరుధ్యాలను స్పష్టం చేస్తోంది.
రాజమహేంద్రవరంలోనూ వివాదాలే..
ఈ వివాదాలు చాలవా అన్నట్టు రాజమహేంద్రవరం నగరంలో కూడా దాదాపు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజుల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకున్న సామెత చందంగా వీరి సాన్నిహిత్యం కొనసాగుతోంది. రాజమహేంద్రవరం సిటీలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి తమ నేతకు వ్యతిరేకంగా పార్టీని దెబ్బతీస్తున్నారని సోము వర్గం ఆరోపిస్తోంది. బ్రాందీ షాపులు, బెల్ట్ షాపుల వ్యవహారంలో బుచ్చయ్య, ఆకుల వర్గీయులు మిలాఖతైపోయారని సోము వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీలో సీనియర్ అయిన వీర్రాజు వద్దనుకుంటేనే ఆకులకు టిక్కెట్టు వచ్చిన విషయాన్ని విస్మరించి రాజకీయంగా తిరిగి ఆయనపై కత్తులు దూసే పరిస్థితిపై సీనియర్లు మండిపడుతున్నారు. ఈ కీచులాటల మధ్య కమల వికాసానికి బదులు విలాపంతో కుమిలిపోతోందని బీజేపీ అభిమానులు మథనపడుతున్నారు.