వీసీ రేస్.. క్లైమాక్స్!
► నేడు హైదరాబాద్‌లో సెర్చ్ కమిటీ సమావేశం
► పైరవీలు ముమ్మరం చేసిన ఆశావహులు
► రంగంలోకి కొత్త ముఖాలు
► ఎంపిక అనూహ్యమే అంటున్న క్యాంపస్ వర్గాలు
సామాజిక సమీకరణలా.. రాజకీయ పైరవీలా.. వాస్తవ అర్హతలా?.. ఏయూ వీసీ ఎంపికలో ఏ అంశం పైచేయి సాధిస్తుంది. అంతిమంగా ఎవరి మాట చెల్లుతుంది.. ఎవరి ప్రయత్నం ఫలిస్తుందన్నది ఇప్పుడు క్యాంపస్‌లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మరికొన్ని గంటల్లో సెర్చ్ కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం పోటీలో ఉన్నవారితోపాటు అనూహ్యంగా కొత్త పేర్లు తెరపైకి రావడంతో వీసీ రేస్ క్లైమాక్స్‌కు చేరింది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాల యం వైస్ చాన్సలర్ పదవి కోసం ఇదే క్యాంపస్‌కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు బహిరంగంగా వీసీ పదవే లక్ష్యంగా ఆధిపత్య పోరు సాగిస్తుండగా.. మరికొందరు చాపకింద నీరులా పావులు కదుపుతూ చాణక్యం ప్రదర్శిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనసులో ఏముందో ఇప్పటికీ అంతు చిక్కని పరిస్థితుల్లో రేస్‌లోకి మరికొందరు రంగప్రవేశం చేయడంతో పోటీ రసకందాయంలో పడింది.
సుమిత్రా దావ్రా నోట సీఎం మాట!
కొత్త వీసీ ఎంపికకు నియమించిన సెర్చ్ కమిటీ శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశం కానుంది. ఏయూ నామినీగా ఆనందకృష్ణన్( అన్నా విశ్వవిద్యాలయం మాజీ వీసీ), యూజీసీ నామినీగా రాజ్‌పాల్ సింగ్( పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ), గవర్నర్ నామినీ సుమిత్రా దావ్రా( ఉన్నత విద్యా శా ఖ ముఖ్య కార్యదర్శి) ఈ కమిటీలో సభ్యులుగా ఉ న్నారు. వీసీ పదవికి అందిన దరఖాస్తులను ఈ కమి టీ పరిశీలించి ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది.
ఇది పైకి కనిపించే తంతు మాత్రమే. కానీ సీఎం చంద్రబాబు ఎవర్ని వీసీగా నియమించాలని భావిస్తున్నారో ఆ పేరును గ వర్నర్ నామినీగా ఉన్న సుమిత్రా దావ్రా సూచిస్తారు. అదే పేరు సెర్చ్ కమిటీ ప్రభుత్వానికి నివేదించే జాబితాలో మొదటి స్థానంలో ఉంటుంది. దాంతో ఆమె సూచించే పేరు ఎవరిదన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.
రేసు ఆసక్తికరం
క్యాంపస్ నుంచి ఇన్చార్జి వీసీ నారాయణ, రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వరరావు వీసీ పదవి కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాగా హఠాత్తుగా మరికొందరు ఈ రేసులో ముందంజ వేయడం గమనార్హం. గతసారి విఫలయత్నం చేసిన ఇన్చార్జి వీసీ నారాయణ ఈసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన పూర్తిగా మంత్రి గంటా శ్రీనివాసరావునే నమ్ముకున్నారు. తనను ఎంపిక చేస్తే కాపు సామాజిక వర్గానికి గుర్తింపునిచ్చినట్లు అవుతుందని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. మంత్రి గంటా కూడా నారాయణ కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. విద్యా శాఖ మంత్రిగా తన జిల్లాలో వీసీ ఎంపికలోనైనా తన మాట చెల్లుబాటు కావాలి కదా అని ఆయన వాదిస్తున్నారు.
కానీ ఆయన వాదనకు సీఎం చంద్రబాబు నుంచి సానుకూల స్పందన లభించకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రధానంగా సామాజికవర్గ సమీకరణను ప్రస్తావిస్తూ పైరవీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. సీఎం పేషీ స్థాయిలో పైరవీలతోపాటు తమ సామాజికవర్గ పెద్దలతో సీఎంకు సిఫార్సు చేయించేందుకు యత్నిస్తున్నారు. ఆయనపట్ల చంద్రబాబు వైఖరి ఏమిటన్నది స్పష్టం కావడం లేదు. ఇటీవల క్యాంపస్‌లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాలు, పీహెచ్‌డీల ప్రవేశాల్లో రిజిస్ట్రార్‌గా ఆయన బాధ్యత కూడా ఉందన్న వాదన బలంగా వినిపిస్తుండటం ఉమామహేశ్వరరావు ప్రతికూలంగా మారుతోంది.
రంగంలోకి ఇతర వర్సిటీల వారు
కాగా చడీచప్పుడు కాకుండా మరికొందరు రేసులో ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. ఏయూ చరిత్ర విభాగానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణకుమారి పేరు తాజాగా తెరపైకి వచ్చింది. గతంలో ఆమె ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా కూడా చేశారు. ఆమె అభ్యర్థిత్వం పట్ల హైదరాబాద్ స్థాయిలో సానుకూలత వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
సామాజికవర్గ సమీకరణపరంగా కూడా ఆమె ఎంపిక రెట్టింపు ప్రయోజనాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. తిరుపతి ఎస్వీయూకు చెందిన ఓ ప్రొఫెసర్ కూడా సీఎం చంద్రబాబును కలసి తనకు అవకాశం ఇవ్వమని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాబు మనసులో మాట ఏమిటన్నది శుక్రవారం సెర్చ్ కమిటీ సమావేశంలో సమిత్రా దావ్రా వెల్లడించనున్నారు. సెర్చ్ కమిటీ నివేదికకు గవర్నర్ ఆమోదం తరువాతే కొత్త వీసీ ఎవరన్న ఉత్కంఠతకు తెరపడుతుంది.