కలుపుతీత ఇక సులభం!
పెరటి తోట పనులను సులభతరం చేసే సరికొత్త పరికరానికి రూపకల్పన
ఎవరికి వారే తయారు చేయించుకోవచ్చు
పెరటి తోటల్లో మనిషి నిలబడే కలుపు తీయడానికి, పాదులు తీసుకోవడానికి ఉపకరించే ఈ పరికరాన్ని ప్రకాశం జిల్లా కందుకూరు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఎం. లక్ష్మణరావు రూపొందించారు. కూరగాయలు, ఆకుకూరలు పండించే రైతులకు ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఎవరికి వారే స్థానికంగా తయారు చేసుకోవచ్చు. తయారీకి కావాల్సిన ఇనప సామగ్రి: 3 అడుగుల పైపు, 2 అడుగుల పైపు, 10 సెంటీమీటర్ల పొడవైన చువ్వలు నాలుగు. 3 అడుగుల పొడవైన పైపునకు పైభాగాన అడ్డంగా 2 అడుగుల పైపును ఉంచి వెల్డింగ్ చేయాలి.
10 సెంటీమీటర్ల పొడవైన 4 చువ్వలను తీసుకొని.. వాటి కొనలను సన్నగా చేసి, వాటిని అర్థ చంద్రాకారంగా వంచాలి. నిలువు పైపునకు అడుగున (కొనలను కింది వైపునకు ఉంచి) వాటిని తగిన విధంగా అమర్చి వెల్డింగ్ చేయాలి. 2 అడుగుల పైపును చేతులతో పట్టుకొని నేల మీద తిప్పుతూ ఉంటే.. కలుపు మొక్కలు వేళ్లతోపాటు లేచి వస్తాయి. నేల గుల్ల బారుతుంది. ఒకే చోట కొంత సేపు అలాగే చేస్తుంటే.. మొక్క నాటు కోవడానికి అడుగు వెడల్పున పాది సిద్ధమవుతుంది. వయోవృద్ధులు నడుము, మోకాళ్ల నొప్పుల బాధ లేకుండా దీనితో పెరటి తోటల్లో పనులు చూసుకోవచ్చు. ఈ పరికరాన్ని వినియోగిస్తున్న గుంటూరు జిల్లా కొలకలూరుకు చెందిన రైతు సురేష్ (98484 06407) సంతృప్తిని వ్యక్తం చేశారు.