'చంద్రబాబు పచ్చి నియంత'
ఒంగోలు టౌన్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పచ్చి నియంతలా వ్యవహరిస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్ ధ్వజమెత్తారు. తన పార్టీ వారి పట్ల ఒకరకంగా, ప్రతిపక్ష పార్టీలతో ఇంకోలా వ్యవహరిస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఒంగోలులో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు హాజరైన ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
శాసనమండలి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తూ చేయి పట్టుకునే సమయంలో 'డోంట్ టచ్ మీ' అన్నందుకు అట్రాసిటీ కేసు నమోదు చేశారని, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన ముసునూరు తహ శీల్దార్ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో పాటు అతడి అనుచరులు దాడిచేస్తే, ఆయనపై చర్యలు తీసుకోకపోగా.. ఇసుక అక్రమ రవాణా వద్దకు ఎందుకు వెళ్లావంటూ చంద్రబాబు తహశీల్దార్‌ను ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలపై రోడ్డెక్కితే తొక్కేస్తా అంటూ చంద్రబాబు పదేపదే బెదిరిస్తున్నారని, రాజకీయాల్లో ఉపయోగించని భాషను మాట్లాడుతూ.. భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. గతంలో దేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్లు ఎన్నడూ తొక్కేస్తానంటూ బెదిరించిన దాఖలాలు లేవని గపూర్ మీడియాతో వివరించారు.