తిరుపతి జూ ఆపరేషన్
– ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావద్దు
– తెల్ల దుస్తులు ధరించకూడదు
– పోలీస్, అటవీ సిబ్బంది రాత్రి గస్తీ
– మదనపల్లె సబ్ కలెక్టర్ కతికాబాత్రా
రామసముద్రం: రామసముద్రం మండలంలో సంచరిస్తున్న గజరాజును పట్టేందుకు తిరుపతి జూ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ గజరాజు’ను సోమవారం ఉదయం 6 గంటలకే ప్రారంభించనున్నట్లు మదనపల్లె సబ్ కలెక్టర్ కతికాబాత్రా తెలిపారు. ఆదివారం రాత్రి ఆమె రామసముద్రంలో గజరాజు దాడిలో మతి చెందిన టి.రామప్ప(70) మతదేహాన్ని పరిశీలించారు. సోమవారం ఉదయం రూ.5 లక్షలు పరిహారం చెక్కును కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు. ఏనుగు గ్రామాలు, పొలాల్లో హల్చల్ చేస్తుండడంతో గ్రామాల్లో ప్రజలెవ్వరు బయటకు రాకూడదన్నారు. చిన్న పిల్లలు, వద్ధులు, మహిళలు గజరాజు ఉన్న చోటకు రావద్దని హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా బయట తిరిగే వ్యక్తులెవ్వరు తెల్లుదుస్తులు ధరించవద్దని సూచించారు. సోమవారం ఉదయం 6 గంటలకే తిరుపతి జూ శాఖ ఆధ్వర్యంలో ఇంజక్షన్లు వేసి గజరాజును పట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రామసముద్రం సబ్స్టేషన్ వద్ద చింతతోపులో మకాం వేసిన గజరాజు కదలికలను పసిగట్టేందుకు వి.కోట, పలమనేరు, పుంగనూరు నుంచి అటవీశాఖ సిబ్బంది, పుంగనూరు, రామసముద్రం, చౌడేపల్లె ప్రాంతాల నుంచి పోలీసు బలగాలు రాత్రి గస్తీ చేయాలని ఆదేశించారు. రాత్రివేళ ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. గజరాజు ఉన్న ప్రదేశంలో రాత్రి టపాకాయలు పేల్చుతూ మంటలు వేసుకుని కాపలా కాయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్వో చక్రపాణి, ఎస్ఐ సోమశేఖర్, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు.