విశాల్‌కు పెద్ద హిట్టు ఖాయం
తమిళంలో విశాల్ నటించిన చిత్రాలన్నీ దాదాపుగా తెలుగులోనూ విడుదలవుతుంటాయి. ఆ కోవలో సుందర్ .సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించి, నిర్మించిన ‘అంబల’ చిత్రం తెలుగులో ‘మగమహారాజు’ పేరుతో విడుదల కానుంది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో హన్సిక కథానాయిక. హిప్ హాప్ తమిళ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో హీరో రానా విడుదల చేశారు.
ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ -‘‘ఇందులో విశాల్ పోలీసాఫీసర్ పాత్ర చేశారని అర్థమవుతోంది. మంచి యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్మెంట్ కూడా ఉందని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాతో విశాల్‌కు పెద్ద హిట్టు ఖాయం’’ అని చెప్పారు. విశాల్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ మంచి పాటలిచ్చారు. కేవలం రెండు వేల అయిదు వందల రూపాయల ఖర్చుతో పాటలు పూర్తి చేశాడు. సంక్రాంతి కానుకగా తమిళ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం.
ఇంకా తెలుగు చిత్రం విడుదల తేదీని ఖరారు చేయలేదు. తెలుగులో నేను చేయబోయే స్ట్రయిట్ చిత్రం వచ్చే నెల ఆరంభమవుతుంది’’ అని చెప్పారు. సుందర్ దర్శకత్వంలో తాను చేసిన మూడో చిత్రం ఇదని హన్సిక తెలిపారు. ఈ వేడుకలో నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, వడ్డి రామానుజం, వైభవ్, శ్రీయారెడ్డి పాల్గొన్నారు.