Maha River
-
అనుసంధానంపై అనుమానాల నివృత్తి!
సాక్షి, హైదరాబాద్: నదుల అనుసంధానంపై రాష్ట్రాలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ముఖ్యంగా మహానది-గోదావరి అనుసంధానంపై ఒడిశా అభ్యం తరాలకు పరిష్కారాన్ని చూపాలని భావిస్తోంది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో కీలక చర్చలు జరుగనున్నాయి. సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు హాజరుకానున్నారు. మహానది పరీవాహక రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు గోదావరి పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీల అభ్యంతరాలను కేంద్రం తెలుసుకోనుంది. తదనుగుణంగా ఓ కార్యాచరణను తీసుకునే అవకాశం ఉంది. మహానది-గోదావరిల కలయికలో భాగంగా ఒడిషా లో మణిభద్రా డ్యామ్‌ను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించినా.. దీనివల్ల 59 వేల హెక్టార్ల భూమి ముంపునకు గురవుతోందని, ఒడిషా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేసింది. ప్రత్యామ్నాయంగా మణిభద్రా డ్యామ్‌కు 14 కి.మీ. ఎగువన బార్ముల్ వద్ద 80 మీటర్ల ఎత్తుతో, 42.56 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో డ్యామ్ కట్టాలని కేంద్రం సూచిస్తోంది. ఈ డ్యామ్ నుంచి 840 కి.మీ. దూరంలోని గోదావరిలో నీటిని కలిపే వరకు మధ్యలో మరో 6 డ్యామ్‌లు నిర్మించాలని ప్రతిపాదించింది. ఒడి శాకు పోను మిగిలిన 180 టీఎంసీల నీటిని గోదావరికి అనుసంధానించవచ్చని కేంద్రం చెబుతోంది. గోదావరిలో ఏపీ, తెలంగాణలకున్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు పోనూ మరో 530 టీఎంసీల జలాలను రాష్ట్ర పరిధిలో ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్, ఇచ్చం పల్లి-పులిచింతల ప్రాజెక్టులకు అనుసంధానిం చాలని భావిస్తోంది. అటునుంచి కృష్ణా, పెన్నా, కావేరీలకు తరలించవచ్చని చెబుతోంది. -
మహానది మహోగ్రరూపం
ఒడిశాలో కొనసాగుతున్న వరద బీభత్సం 34కు చేరిన వరద మృతులు.. పొంగిపొర్లుతున్న మహానది, వైతరణి నదులు భువనేశ్వర్/న్యూఢిల్లీ: ఒడిశాలో వరద బీభత్సం కొనసాగుతోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా మహానది, వైతరణితో పాటు అనేక నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 34 మంది వరదల కారణంగా మరణించారు. బుధ, గురువారాల్లోనే ఏడుగురు చనిపోయినట్టు తెలిసింది. వరద తీవ్రత అంతకంతకూ పెరుగుతుండంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ముంపుబారిన పడ్డాయి. 23 జిల్లాలోని 1,553 గ్రామాల్లోని 9.95 లక్షల మంది ప్రజలు ముంపు ప్రభావానికి గురయ్యారని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పీకే మహాపాత్ర తెలిపారు. వేలాది ఎకరాల్లో పంటపొలాలు నీట మునిగాయని, అనేక ప్రాంతాల్లో మహానది, దాని ఉపనదులు ఉధుృతంగా ప్రవహిస్తున్నాయని చెప్పారు. నారజ్, జోబ్రా, డాలిగాయి మొదలైన ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయని, ఇక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేశామని తెలిపారు. కటక్, జగత్సింగ్పూర్, కేంద్రపర, ఖుర్దా, పూరి జిల్లాల్లో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయని, జాజ్‌పూర్, భద్రక్ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 1.11 లక్షల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించామని, వీరికి ఆహారం అందించేందుకు 240 వంట శాలలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సుమారు 400 గ్రామాల్లో రెండున్నర లక్షల మంది జలదిగ్బంధంలో చిక్కుకున్నట్టు వివరించారు.