ఎమ్మెల్యే అశోక్‌బాబుకు చుక్కెదురు
తుని, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచి ఎన్జీఓలు, జేఏసీ, ఇతర కార్మిక సంఘాలు ఉద్యమం చేస్తున్నా.. ప్రజాప్రతినిధులు మాత్రం పదవులను వీడడం లేదని ఎన్జీఓలు దుయ్యబట్టారు. శనివారం స్థానిక జీఎన్టీ రోడ్డులో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు రిలే నిరాహార దీక్షలు చేశారు. వీరికి సంఘీభావం తెలిపేందుకు స్థానిక ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు దీక్షా శిబిరం వద్దకు వచ్చారు. అయితే స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేసిన తర్వాతే ఇక్కడకు రావాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. 38 రోజులుగా ఉద్యమం చేస్తున్న ప్రజల తరఫున ఎన్నికైన ఆయన ఎందుకు ఉద్యమంలోకి రావడం లేదని ప్రశ్నించారు.
సీమాంధ్ర ప్రజలపై అభిమానం ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఊహించని ఈ పరిణామంతో ఎమ్మెల్యే శిబిరం నుంచి నిష్ర్కమించారు. ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారని, ప్రజాప్రతినిధులు మాత్రం తమకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని సమైక్యవాదులు ఆరోపించారు. దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలకు తుని మండలం ఎస్.అన్నవరం పంచాయతీ పరిధిలోని వ్యాపారవేత్తలు, వివిధ పార్టీల నాయకులు దాడిశెట్టి రాజా, నరిసే శివాజీ, పోలిశెట్టి సోమరాజు, వంగలపూడి సత్యనారాయణ, చోడిశెట్టి త్రిమూర్తిస్వామి, సకురు నాగేంద్ర నెహ్రూ, అప్పన శ్రీరాములు తదితరులు సంఘీభావం తెలిపారు.