ఆటో డ్రైవర్ దారుణ హత్య
ప్రాణం తీసిన పగ !
మేకలు కోసే కత్తితో దాడి
అయిదుగురిపై కేసు
నిందితులు పరార్
రాత్రి పది గంటలు.. గ్రామంలో జాతర జరుగుతోంది. సాంస్కృతిక సంబరాలతో ఊరంతా ఎంతో సందడిగా ఉంది. జనం కిక్కిరిసి ఉన్నారు. అలాంటి సమయంలో ఓ జులాయి రోడ్డుకు అడ్డంగా బైక్ పెట్టాడు. అదే విషయాన్ని ప్రశ్నించిన ఓ ఆటో డ్రైవర్‌ను కత్తితో మెడపై పొడిచేశాడు. అడ్డుకున్న వ్యక్తినీ గాయపరిచాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన పాయకరావుపేట మండలం రామభద్రపురంలో చోటుచేసుకుంది.
పాయకరావుపేట : మండలంలోని పెదరామభద్రపురంలో ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. మరో వ్యక్తి కత్తిపోటుకు గురయ్యా డు. యలమంచిలి సీఐ సీహెచ్ మల్లేశ్వరరావు, బాధితుల కథనం ప్రకారం.. పెద రామ భద్రపురంలో ఆదివారం మరిడమ్మ జాత ర జరిగింది. రాత్రి పది గంటల సమయంలో వినాయకుని గుడి సెంటల్లో గ్రామానికి చెంది న నారపురెడ్డి సతీష్ తన అనుచరులతో మోటార్‌సైకిల్‌పై వచ్చి రోడ్డుకు అడ్డుగా బండి ఆపా డు.
అడ్డుగా పెట్టావేంటని ప్రశ్నించిన వారితో గొడవకు దిగాడు. ఇదే సమయంలో గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తాడి సత్తిబాబు (35) కూడా మోటర్ సైకిల్‌పై వెళ్తూ .. ‘రోడ్డుకు అడ్డు గా బండి పెట్టడం వల్ల ఇబ్బందిగా ఉంద’ని చెప్పాడు. దీంతో వివాదం మొదలైంది. గొడవ పెరగడంతో నారపురెడ్డి సతీష్ తన మోటార్ సైకిల్లో దాచిన కత్తిని తీసి ఆటో డ్రైవర్ తాడి సత్తిబాబు మెడపై పొడిచాడు.
దీంతో అతడు తీవ్ర రక్తస్రావమై పడిపోయాడు. సమీపంలోనే ఉన్న సత్తి బాబు చిన్నాన్న కుమారుడు తాడి జయప్రసాద్ అడుక్డునే ప్రయత్నం చేశాడు. సతీష్ అతడి ఛాతిపైనా కత్తితో పొడిచాడు. ప్రసాద్ తప్పించుకుని వెళ్లి బంధువులకు సమాచారం అందించాడు. వారు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి తాడి సత్తిబాబు తీవ్ర రక్తస్రావమై పడి ఉండగా వెంటనే తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అనంతరం వైద్యులు కాకినాడ జనరల్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడికి తీసుకువెళ్లగా విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. కాకినాడ నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో సత్తిబాబు మృతి చెందాడు. గాయపడ్డ తాడి జయప్రసాద్ తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పోలీసుల దర్యాప్తు : సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ సిహెచ్ హరికృష్ణ గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. యలమంచిలి సీఐ హెచ్. మల్లేశ్వరరావు కూడా సంఘటనా స్థలాన్ని పరి శీలించి మృతుని బంధువులు, గ్రామస్తుల నుం చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి కేసు దర్యాప్తు చేస్తున్నా రు. ఈ హత్య కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి నక్కిన గోవిందు ఫిర్యాదు మేరకు నిందితుడు నారపురెడ్డి సతీష్‌తోపాటు నారపుపురెడ్డి అప్పాజి, నారపురెడ్డి రమణ, నారపురెడ్డి కృష్ణ, కొల్లాటి బాబ్జిలపై కేసు నమోదు చేశారు.
పథకం ప్రకారమే హత్య
ఆటో డ్రైవర్ సత్తిబాబును పథకం ప్రకారమే హత్య చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. 4 రోజుల క్రితం రామకోవెల ప్రాంతంలో గ్రామానికి చెందిన వ్యక్తి సత్తిబాబు హత్యకు పథకం వేశాడని మృతుని సోదరుడు తాడి బాబురావు చెప్పారు. మేకలను కోసి చర్మం తీసే కత్తులను ఉపయోగించి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మృతుడు ఆటో డ్రైవర్ సత్తిబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె మృతదేహం వద్ద విలపించిన తీరు గ్రామస్తులను కంటతడిపెట్టించింది.
మితిమీరిన సతీష్ ఆగడాలు!
రామభద్రపురానికి చెందిన నారపురెడ్డి సతీష్ జులాయిగా తిరుగుతూ కొంతకాలంగా గ్రామస్తులపై దాడులకు దిగి భయాందోళనలకు గురి చేస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తప్పతాగి పెద్ద చిన్నా తారతమ్యం లేకుండా విచాక్షణారహితంగా కొట్టడం వంటి చర్యలు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల అంగన్వాడీ సిబ్బందిపైనా దాడి చేసినట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎవ్వరూ సాహసించకపోవడంతో హత్యకు తెగబడ్డాడని పేర్కొంటున్నారు. గతంలో వీరిద్దరి మధ్య చిన్నచిన్న తగాదాలున్నట్లు పేర్కొంటున్నారు.