ఇద్దరు చిన్నారులు దుర్మరణం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు స్థానికంగా విషాదాన్ని నింపాయి. మంగళ్‌హాట్, చాంద్రాయణగుట్టలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మూడేళ్ల మరుయం, అయిదేళ్ల హర్షవర్థన్ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..
సీతారాం బాగ్ చౌరస్తా వద్ద హర్షవర్ధన్ అనే అయిదేళ్ల బాలుడిని పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో గాయపడిన బాలుడిని హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పెట్రోలింగ్ వాహనం డ్రైవర్ భగవాన్ రెడ్డి పై చర్యలు తీసుకుంటామని సీఐ రంవీర్ రెడ్డి తెలిపారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. (రోడ్డు ప్రమాదాలు తగ్గితే ఊహించని స్థాయిలో..)
నిర్లక్ష్యం ఖరీదు ఓ పసి బాలిక మృతి..
మరోవైపు హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మిల్లత్ నగర్ వద్ద ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన మూడేళ్ల మరుయం అనే బాలిక టిప్పర్ టైర్ల కింద పడి నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పాప మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో స్థానికులు తీవ్ర కోపోద్రిక్తులు అవుతున్నారు. (ఘోర ప్రమాదం; గర్భిణి సహా ఏడుగురు మృతి)