మహిళకు తెలియకుండానే శరీరంలో బుల్లెట్..
నరసన్నపేట (శ్రీకాకుళం): రైలు కోసం స్టేషన్లో ఎదురుచూస్తున్న ఓ మహిళ శరీరంలోకి ఆమెకు తెలియకుండానే బుల్లెట్ దిగింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బుధవారం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని డాక్టర్లు కనుగొని బుల్లెట్‌ను తొలగించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం లచ్చన్నపేటకు చెందిన శ్రీకాకుళం సత్య(28) అనకాపల్లిలో ఉంటున్నారు. ఇటీవలే జన్మించిన తన కుమారుడిని స్వగ్రామం తీసుకువచ్చేందుకు బుధవారం విశాఖలోని మర్రిపాలెం రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో సత్యకు వెనక వైపు నుంచి వీపుకు ఏదో వస్తువు బలంగా తగిలింది. రాయి తగిలి ఉంటుందని సత్య కుటుంబ సభ్యులు బావించారు.
గాయపడిన ఆమెకు స్థానికంగా స్వల్ప చికిత్స చేయించి ప్రైవేటు వాహనంలో నరసన్నపేటకు తీసుకువచ్చారు. ఇక్కడకు వచ్చే సరికి గాయం తీవ్రత పెరగడంతో స్థానిక వాత్సల్య ఆసుపత్రిలో చూపించారు. పరిశీలించిన వైద్యులు ఎక్స్‌రే తీయగా అది బుల్లెట్‌గా గమనించి వెంటనే ఆపరేషన్ చేసి తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు గొలివి మోహనరావు తెలిపారు. సత్య భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.