Maternal death
-
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. బాలింత మృతి
అనంతపురం న్యూసిటీ: ఓ బాలింత మృతి వివాదాస్పదంగా మారింది. రక్తం ఎక్కించే సమయంలో పొరపాటే ఇందుకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన జిల్లా కేంద్రం అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చోటు చేసుకుంది. శింగనమల మండలం ఆకులేడుకు చెందిన ఎం.సుకన్య(26)ను రెండో కాన్పు కోసం ఈ నెల 17న సర్వజనాస్పత్రిలో చేర్చారు. ఈ నెల 19న ఆమెకు సిజేరియన్ చేయగా ఆడపిల్ల జన్మించింది. అదే రోజు ఓ–నెగిటివ్ రక్తం ఎక్కించారు. సుకన్యకు యూరిన్ రాకపోవడంతో వైద్యులు పరీక్షించి.. నెఫ్రాలజీ సేవలు అవసరమని కర్నూలుకు తీసుకెళ్లాలని సూచించారు. భర్త శివప్రసాద్, కుటుంబ సభ్యులు ఆమెను 20వ తేదీ కర్నూలు ఏఎంసీకి తీసుకెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె మరణించింది. వందలాదిమందితో ఆందోళన: కర్నూలులోని కొందరు ఆస్పత్రి సిబ్బంది రక్త మార్పిడి సరిగా జరగలేదని చెప్పారని.. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు వందలాదిమందితో ఆదివారం రాత్రి సర్వజనాస్పత్రి ఎదుట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రక్తమార్పిడిపై అనుమానం ఉంటే పోస్టుమార్టం చేస్తే తెలుస్తుందని ఆర్ఎంవో డాక్టర్ లలిత చెప్పారు. ఇదే విషయమై గైనిక్ హెచ్ఓడీలు డాక్టర్ షంషాద్‌బేగం, డాక్టర్ సంధ్యలను ‘సాక్షి’ ఆరా తీయగా.. సుకన్యకు ఆమె గ్రూపు రక్తం(ఓ–నెగిటివ్) ఎక్కించామని, యూరిన్ రాకపోవడంతో కర్నూలుకు రిఫర్ చేసినట్టు వివరించారు. -
వైద్యుల నిర్వాకం,బాలింత మృతి
-
ప్రాణం తీసి.. ‘బీ పాజిటివ్’ అంటున్నారు
అనంతపురం న్యూ సిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలో తాడిపత్రికి చెందిన బాలింత ఎస్.అక్తర్‌భాను మృతిపై తక్షణ విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో కలెక్టర్ ఎస్.సత్యనారాయణ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చేందుకు సాక్షాత్తు జిల్లా కలెక్టర్‌నే బురిడీ కొట్టించేందుకు వైద్యుల బృందం యత్నించింది. సర్వజనాస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ ఈ నెల 27న బాలింత ఎస్.అక్తర్‌భాను మృతి చెందిన విషయం విదితమే. ఆమెకు ఓ పాజిటివ్ రక్తం ఎక్కించాల్సి ఉండగా.. బీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె మరణించింది. ఈ విషయమై ‘ఆస్పత్రి నిర్లక్ష్యం–బాలింత మృతి’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితం కాగా.. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. బాలింత మృతికి కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ఆదేశించారు. రంగంలోకి దిగిన కలెక్టర్ విచారణలో భాగంగా సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్‌తో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఘటనపై పక్కా నివేదిక ఇవ్వాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, బ్లడ్ బ్యాంక్ వైద్యులు, పెథాలజిస్టులు మృతురాలు అక్తర్‌భాను బ్లడ్ గ్రూపు బీ పాజిటివ్ అని రాసి ఉన్న రికార్డులను కలెక్టర్‌కు చూపించారు. అంతేకాకుండా వేరొకరి రక్తాన్ని తీసుకొచ్చి కలెక్టర్ సమక్షంలో బీ పాజిటివ్‌గా నిర్థారణ చేశారు. అయితే, ఆస్పత్రి యాజమాన్యం వాదనతో ఏకీభవించని కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్, ఐఏఎస్ అధికారిణి పి.ప్రశాంతిని విచారణ అధికారిగా నియమించగా, వారు సుదీర్ఘంగా విచారించి మృతురాలి బ్లడ్ గ్రూపు ఓ పాజిటివ్ కాగా.. బీ పాజిటివ్ రక్తం ఎక్కించినట్టు గుర్తించారు. గైనిక్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బాలింత మరణించినట్టు నిర్థారణకు వచ్చారు. కాగా, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుకుంటారు. డీఎంహెచ్ఓ చొరవతో వెలుగులోకి.. ఈ నెల 26న ఇతర రక్త పరీక్షల కోసం ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు బాలింత బ్లడ్ శ్యాంపిల్స్‌ను రాయలసీమ డయాగ్నొస్టిక్కు పంపారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్ పలుమార్లు పెథాలజిస్టుతో బ్లడ్ శాంపిల్స్ పరీక్ష చేయించగా అసలు నిజం వెలుగు చూసింది. -
బాత్రూం గోడకూలి బాలింత మృతి
హసన్‌పర్తి: బాత్రూం గోడకూలి ఓ బాలింత మృతిచెందగా, ఆమె తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లా మల్లారెడ్డిపల్లికి చెందిన రాయరాకుల రాజమౌళి–మంజుల దంపతుల రెండో కూతురు అనూష(22)ను తాటికొండకు చెందిన అక్కన్నపల్లి మహేశ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. 15 రోజుల క్రితం ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. కాగా, ఆదివారం అనూషకు స్నానం చేయించేందుకు తల్లి మంజుల ఆమెను బాత్రూంకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి గోడలు నానిపోయి ప్రమాదవశాత్తు వారిపై కూలాయి. దీంతో తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లను కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. అనూష మృతిచెందింది. -
వైద్యం వికటించి బాలింత మృతి
హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్రవంతి అనే బాలింత చికిత్సపొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే స్రవంతి మృతిచెందిందని మృతురాలి కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆదివారం ఉదయం ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం అనంతసాగరానికి చెందిన స్రవంతి, సంగమేష్ దంపతులు కూకట్పల్లి జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు. స్రవంతి రెండు రోజుల క్రితం సదాశివపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పండంటి బిడ్డను ప్రసవించింది. అయితే ఉమ్మనీరు గర్భసంచిలో చేరడంతో అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. స్రవంతికి పెన్సిలిన్ ఇంజక్షన్ ఇచ్చినందున వికటించి ఆమె మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. -
ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత మృతి
రాయికల్ : అధిక రక్తస్రావం కారణంగా ఓ బాలింత మృతిచెందింది. వివరాలు.. మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన మంద జ్యోతి (26) ప్రసవం కోసం శుక్రవారం రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. పురిటి నొప్పులు రావడంతో వైద్యురాలు చైతన్యసుధ పర్యవేక్షణలో ఆమె పాపకు జన్మనిచ్చింది. అనంతరం తీవ్ర రక్తస్రావం అయింది. అప్రమత్తమైన వైద్యురాలు జగిత్యాల ఏరియా ఆస్పత్రి నుంచి రక్తం తెప్పించారు. అయితే అప్పటికే పల్స్రేట్ పడిపోవడంతో బాలింత జ్యోతి మృతిచెందింది. ఆగ్రహానికి గురైన మృతురాలి బంధువులు ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు. కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు, ఎస్సై మధూకర్, ఎంపీపీ పడాల పూర్ణిమ, సర్పంచ్ రాజిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. వైద్యురాలు చేసిన చికిత్సలు వివరించారు. దీంతో వారు శాంతించారు. ఈ విషయమై వైద్యురాలు చైతన్యసుధను వివరణ కోరగా ఉదయం 6 గంటల నుంచి ముగ్గురికి ప్రసవాలు చేశామని, మంద జ్యోతికి ప్రసవం బాగానే జరిగినట్లు వివరించారు. ఒకేసారి రక్తస్రావం తీవ్రం కావడంతో పల్స్రేట్ పడిపోయి మృతిచెందినట్లు తెలిపారు. -
బాలింత మృతితో ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన
బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఓ బాలింత మృతి చెందిన సంఘటన శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బాలింత మృతితో ఆమె బంధువులు కోపం కట్టలు తెంచుకుంది. దాంతో ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బంధువు మృతి చెందిందని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆందోళనకారులను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.