క్లాస్ రూంలో ఉపాధ్యాయుడి ఆత్మహత్య
బోగస్ మెడికల్ బిల్లు కేసు భయం.. అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాఠశాల తరగతి గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కడెం మండలం దస్తూరాబాద్ పంచాయతీ పరిధి రాంపూర్ గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కడెం : దస్తురాబాద్ గ్రామానికి చెందిన మారవేని రాజన్న(51) పంచాయతీ పరిధిలోని రాంపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రోజూలాగే గురువారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లాడు. హెచ్ఎం ప్రభాకర్ సెలవులో ఉండడంతో రాజన్నే ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం త్రైమాసిక పరీక్షల దృష్ట్యా ఉదయం గణితం సబ్జెక్టు పరీక్ష నిర్వహించారు. రాజన్న విద్యార్థులతో పరీక్ష రాయించాడు.
కాసేపటికి తనకు తల నొప్పిగా ఉందని, పక్క గదిలోకెళ్లి నిద్రిస్తానని, తనను డిస్ట్రబ్ చేయవద్దని, పరీక్ష సాఫీగా రాయండని విద్యార్థులకు చెప్పి, పాఠశాల ప్రాంగణంలోని అదనపు తరగతి గదికి వెళ్లాడు. మధ్యాహ్న భోజన సమయం అవుతున్నా రాజన్న బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన విద్యార్థులు గదిలోకి వెళ్లి చూడగా తాడుతో ఉరేసుకొని ఉన్న రాజన్న మృతదేహం కనిపించింది. ఎస్సై టీవీ.రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రాజన్న షర్టు జేబులో సూసైడ్ నోట్ లభ్యమైంది. బోగస్ మెడికల్ బిల్లు కేసు భయం, అనారోగ్య కారణాలతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, విద్యార్థులు క్షమించాలని అందులో పేర్కొన్నాడు. అతడికి భార్య లక్ష్మి, కుమార్తెలు స్వాతి, శ్వేత ఉన్నారు.
చిన్నకూతురు శ్వేతకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, 2013లో రాజన్నపై బోగస్ మెడికల్ రీయింబర్స్మెంట్ కేసు నమోదైందని, కేసు భయంతోపాటు అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నాడని అతడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కాగా, రాజన్న మృతి విషయం తెలిసి సహచర ఉపాధ్యాయులు, స్థానికులు పెద్ద ఎత్తున పాఠశాలకు తరలివచ్చారు. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంఈవో భూమన్న, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పరామర్శించారు. రాజన్న మృతికి వేర్వేరుగా సంతాపం ప్రకటించారు.