'నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి.. ప్లీజ్'
'వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్న అందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నాపట్ల ఆగ్రహంగా ఉండొచ్చు. మీ పట్ల నాకు కోపం ఉండొచ్చు. కానీ దయచేసి నాకొక అవకాశాన్ని ఇవ్వండి'.. ఇది జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి ఆందోళనకారులకు చేసిన విజ్ఞప్తి. గత 49 రోజులుగా కశ్మీర్లో అశాంతి కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ప్రధాని నివాసమైన 7రేస్‌కోర్సు రోడ్డు రెసిడెన్సీలో జరిగిన వీరి భేటీలో కశ్మీర్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిసింది.
ప్రధానితో భేటీ అనంతరం సీఎం మెహబూబా మీడియాతో మాట్లాడారు. కశ్మీర్లో హింసకు చరమగీతం పాడాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని ఆమె తెలిపారు. 'మనందరిలాగే ప్రధాని మోదీ కూడా జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితిపై తీవ్ర ఆందోళనతో ఉన్నారు' అని తెలిపారు. లోక్‌సభలో మోదీకి మూడింట రెండొంతుల సంఖ్యాబలం ఉందని, ఆయన వల్ల కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించకుంటే, మరెవరి వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభించబోదని దివంగత సీఎం, తన తండ్రి ముఫ్తి మహమ్మద్ సయ్యద్ ఎప్పుడూ చెప్పేవారని ఆమె గుర్తుచేశారు.
కశ్మీర్‌లోయలో హింసకు పాకిస్థానే కారణమని ఆమె ధ్వజమెత్తారు. 'కశ్మీర్ యువత పట్ల పాకిస్థాన్‌కు ఏమాత్రం కనికరమున్నా.. సెక్యూరిటీ క్యాంప్స్, పోలీసు స్టేషన్లపై దాడిచేసేలా వారిని రెచ్చగొట్టడం మానుకోవాలి' అని ఆమె సూచించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ ఇప్పటికే పాకిస్థాన్ సందర్శించారని, కానీ పాక్ నేతలు ఎందుకు ప్రతిస్పందించడం లేదని ఆమె నిలదీశారు. కశ్మీర్ వేర్పాటువాద నేతలు కూడా లోయలో శాంతి నెలకొనేందుకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జూలై 8న భద్రతా దళాల ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ చనిపోవడంతో కశ్మీర్లో అల్లర్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.